ఆమె శవం మీద దొరికిన ఆమ్లెట్ ముక్కతో మర్డర్ మిస్టరీ సాల్వ్.. కేస్ క్లోజ్..!

ఆమె శవం మీద దొరికిన ఆమ్లెట్ ముక్కతో మర్డర్ మిస్టరీ సాల్వ్.. కేస్ క్లోజ్..!

మర్డర్ మిస్టరీ సినిమాలు చూసినప్పుడు ఈ కేసులో నిజం ఎలా బయటపడుతుందనే ఉత్సుకత, ఆసక్తి సినిమా చూస్తున్నంత సేపు ఉంటుంది. ప్రేక్షకుడి ఊహకు అందని ఒక పాయింట్ ఆధారంగా మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసినప్పుడే ఆ డైరెక్టర్ దర్శకత్వ ప్రతిభకు అర్థం ఉంటుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా పోలీసులు కొన్ని కేసులను ఇలాంటి చిన్నచిన్న క్లూస్ ఆధారంగానే సాల్వ్ చేస్తారు. తాజాగా.. మధ్యప్రదేశ్లో గ్వాలియర్ పోలీసులు ఇలాంటి కేసునే ఛేదించారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఎలాంటి ఆధారాలు ఉపయోగపడ్డాయంటే.. ఒక ఆమ్లెట్ ముక్క, AI, UPI పేమెంట్. ఈ మూడు క్లూస్ ఆధారంగా ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు సాల్వ్ చేశారు. నిందితుడిని గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు.

ఈ మర్డర్ మిస్టరీ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సచిన్ సేన్, సునీత పాల్ సహజీవనంలో ఉన్నారు. సునీతకు పెళ్లై భర్తకు దూరంగా ఉంటోంది. వారం రోజులు మాత్రమే సచిన్, సునీత రిలేషన్లో ఉన్నారు. ఎనిమిదో రోజుకు ఆమెపై సచిన్ సేన్ అనుమానం పెంచుకున్నాడు. కొందరు మగాళ్లతో ఆమెకు పెళ్లిళ్లు అయి.. వాళ్ల నుంచి విడిపోయిందని అతనికి తెలిసింది. సునీత ఏడు సార్లు పెళ్లి జరిగింది. మొదటి భర్తతో రెండేళ్లు మాత్రమే కలిసి ఉంది. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడం.. విలాసవంతమైన జీవితం గడిపాక వాళ్లను వదిలేయడం.. ఇలా సునీత ఏడుగురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. 

సచిన్ సేన్కు ఇవేవీ చెప్పకుండా అతనితో పరిచయం పెంచుకుంది. అతనికి అనుమానం వచ్చి ఆరా తీయగా ఈ నిజాలు తెలిశాయి. అలాంటివేమీ లేవని చెప్పి తనను ఆమె మోసం చేసిందని సచిన్ సేన్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. మెయిన్ రోడ్ కు దగ్గరలో ఉండే అడవిలోకి తీసుకెళ్లాడు. ఆమె పెళ్లిళ్ల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెరిగి సచిన్ సేన్ ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు. 

Also Read : చిట్టీ డబ్బులు అడిగినందుకు తండ్రీ కొడుకులు కలిసి చితకబాదారు

ఎంతలా అంటే.. ఆమె ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా బండరాయితో కొట్టి ఆమెను హత్య చేశాడు. 2025, డిసెంబర్ 29న గ్వాలియర్లోని నారాయణ్ విహార్ కాలనీ దగ్గరలోని అడవిలో ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు. సునీత ముఖం ఛిద్రం కావడంతో ఆమె ఎవరో కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. స్పాట్లో ఉన్న నెత్తుటి మరకలతో ఉన్న రాయిని.. ఆ మహిళ దుస్తుల ఆనవాళ్లను, ఒక మగ వ్యక్తి దుస్తుల ఆనవాళ్లను, డెడ్ బాడీ మీద ఒక ఆమ్లెట్ ముక్కను పోలీసులు సేకరించారు. ఇందులో.. ఆమ్లెట్ ముక్క ఈ కేసును సాల్వ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.

AIతో సునీత ముఖాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి.. ఆ ఫొటోలను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరా తీశారు. ఆమ్లెట్ దొరకడంతో ఆ దగ్గరలో ఉన్న 200 మందికి పైగా కోడిగుడ్ల వ్యాపారులకు, ఆమ్లెట్ అమ్మే స్టాల్స్లో ఆ ఫొటోను చూపించి విచారించారు. మొత్తానికి ఒక ఆమ్లెట్ స్టాల్ నిర్వాహకుడు ఆమెను గుర్తుపట్టాడు. ఆ మహిళతో పాటు వచ్చిన వాళ్లలో ఆమ్లెట్కు యూపీఐ పేమెంట్ చేసిందెవరో పోలీసులు గుర్తించారు. యూపీఐ పేమెంట్ హిస్టరీ ఆధారంగా నిందితుడు సచిన్ సేన్ అని.. అతను గ్వాలియర్లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. ఇలా ఒక ఆమ్లెట్ ముక్క మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడంలో కీ రోల్ ప్లే చేసింది.