గ్రేటర్‍ లో వరంగల్లో మిస్ట్ బస్టాప్స్ ...రాష్ట్రంలోనే జీడబ్ల్యూఎంసీలో మొదటిసారి ఏర్పాటు

గ్రేటర్‍ లో వరంగల్లో మిస్ట్ బస్టాప్స్ ...రాష్ట్రంలోనే జీడబ్ల్యూఎంసీలో మొదటిసారి ఏర్పాటు
  • బస్టాప్‍ పైభాగంలో నీటితో తడిసిన చల్లని తడకలు, గడ్డి
  •     సేద తీరే ప్రయాణికులపై చల్లనినీటితో స్ర్పింకర్లతో స్ర్పే   
  •     ట్రైసిటీలో 8 ప్రాంతాల్లో ఏర్పాటు 
  •     హనుమకొండ పబ్లిక్‍ గార్డెన్‍, మిషనరీ హాస్పిటల్‍ ఎదురుగా ప్రారంభం

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో తొలిసారిగా గ్రేటర్ వరంగల్​లో ప్రయాణికుల కోసం మిస్ట్​ బస్టాప్‍లు ఏర్పాటు చేశారు. టెంపరేచర్లు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు మండుటెండల నుంచి ఉపశమనం కల్పించేలా గ్రేటర్ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ ఆధ్వర్యంలో చల్లనినీటిని స్ర్పింకర్లతో స్ర్పే చేసేలా సరికొత్త ఆలోచన చేశారు. ఈ బస్టాప్​లో చల్లగా ఉండడం వల్ల వివిధ పనులరిత్యా బయటకొచ్చే ప్రయాణికులు సేదతీరే అవకాశం ఉంది.   

అహ్మదాబాద్‍ తరహాలోనే.. 

గుజరాత్‍ రాష్ట్రం అహ్మదాబాద్‍లో ఏటేటా టెంపరేచర్లు పెరిగి ప్రయాణికులు వడదెబ్బకు గురికావడంతో ఆ ప్రాంతంలో 15 మీటర్ల నుంచి 25 మీటర్ల పొడవైన మిస్ట్​ బస్టాలు ఏర్పాటు చేశారు.  ఇప్పుడు అవే పరిస్థితులు రాష్ట్రంలోనూ కనిపిస్తుండటంతో మొదట గ్రేటర్‍ వరంగల్‍ అధికారులు మిస్ట్​ బస్టాప్‍లను  ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‍ సిటీలో ఉదయం 8 గంటలు దాటిందంటే జనాలు అడుగు బయటపెట్టాలంటే జంకుతున్నారు. ఈ క్రమంలోనే జీడబ్ల్యూఎంసీ అధికారులు రాష్ట్రంలో మొదటిసారి మిస్ట్​ బస్టాప్‍లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్‍, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో దాదాపు 8 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 

కూల్‍కూల్‍ గా మిస్ట్​ బస్టాప్స్..​  

నగరాల్లో మాములుగా ఆర్టీసీ, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసే బస్టాప్‍లు పైకప్పు ఎండకాలంలో వేడిని గ్రహించడంతో ఆ ప్రాంతంలో ప్రయాణికులు నిమిషం పాటు ఉండలేని దుస్థితి ఉంది. అయితే మిస్ట్​బస్టాప్‍ ల్లో పైకప్పు తడకలు, గడ్డితో ఏర్పాటు చేస్తారు. బస్టాప్‍ పైభాగంతో పాటు చుట్టూ పొగమంచు మాదిరి చల్లని నీటిని స్ప్రే చేసేలా స్ప్రింకర్లు అమర్చారు. వీటిలోనుంచి వచ్చే నీరు తడకలు, గడ్డిని తడుపుతాయి. దీంతో ఆ ప్రాంతమంతా చల్లగా మారుతుంది. ప్రయాణికులపై స్ర్పింకర్లతో నీటి తుంపరలు కురిపించడంతో ఎండాకాలం ఎఫెక్ట్​ కనిపించదు. బయట ప్రాంతంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలుంటే మిస్ట్​ బస్టాప్‍లో 5 నుంచి 7 టెంపరేచర్లు తగ్గి 38 డిగ్రీల వాతావరణం ఉంటుంది. దీంతో ప్రధానంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు మండే ఎండల నుంచి ఉపశమనం దక్కుతోంది.

సిటీలో మిస్ట్ బస్టాప్‍ల ప్రారంభం..

గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు మిస్ట్​ బస్టాప్‍లను గురువారం వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ స్పెషల్‍ ఆఫీసర్‍, హనుమకొండ కలెక్టర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ ప్రారంభించారు. హనుమకొండ పబ్లిక్‍గార్డెన్‍తో పాటు ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‍ వద్ద వీటిని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ గ్రేటర్‍ సిటీలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో నగర ప్రజలకు వాటినుంచి ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. మిస్ట్​ బస్టాప్‍లో సేదతీరే వారికి బయటి కంటే టెంపరేచర్లు తక్కువగా ఉంటాయన్నారు. నగరంలో మరికొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు.