
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము
- 2029 జనవరి 26 వరకు పదవిలో కొనసాగనున్న జ్ఞానేశ్
- అంతకుముందు సీఈసీ నియామకంపై మోదీ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ
- కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరు
న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఎలెక్షన్ కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ వివేక్ జోషిని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు తదుపరి సీఈసీ నియామకంపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ ప్యానెల్లో రాహుల్ కూడా సభ్యుడిగా ఉన్నారు.
భేటీ తర్వాత కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ పేరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సెలెక్షన్ కమిటీ సిఫారసు చేసింది. తర్వాత కొన్ని గంటల్లోనే సీఈసీగా జ్ఞానేశ్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిరుడు మార్చిలో జ్ఞానేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. కాగా.. తాత్కాలిక సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఆయన 64 ఏండ్లు పూర్తిచేసుకుని 65వ ఏట అడుగు పెట్టనుండడంతో ఆయన పదవీకాలం ముగియనుంది. కొత్త సీఈసీగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
ఎవరీ జ్ఞానేశ్ కుమార్?
జ్ఞానేశ్ కుమార్ ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కేరళ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. అంతకుముందు పార్లమెంటరీ మంత్రిత్వశాఖలో సెక్రటరీగా పనిచేశారు. అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలోనూ సెక్రటరీగా పనిచేశారు. హోం మంత్రిత్వశాఖలో ఉన్న పుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసినపుడు జమ్మూకాశ్మీర్ ఇన్ చార్జిగా ఉన్నారు.
హడావుడిగా మీటింగ్ ఎందుకు పెట్టారు?: కాంగ్రెస్
మరోవైపు, కొత్త సీఈసీ నియామకంపై నిర్వహించిన భేటీపై కాంగ్రెస్ స్పందించింది. ఓవైపు కొత్త సీఈసీ నియామకంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే భేటీ ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మనూ సింఘ్వీ ప్రశ్నించారు. ప్యానెల్ భేటీ అయిపోయాక మీడియాతో ఆయన మాట్లాడారు. సెలెక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తొలగించి ప్యానెల్‌ను కేంద్రం నియంత్రించాలనుకుంటున్నదని ఆయన విమర్శించారు.
‘‘సీఈసీ, ఈసీలను నియమించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై ఈనెల 19న విచారణ జరగనుంది. అంటే ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ఈలోపే కొత్త సీఈసీని ఎలా ఖరారు చేస్తారు?” అని సింఘ్వీ నిలదీశారు. ఈ కేసుపై విచారణ అయిపోయే తదుపరి సీఈసీ నియామకంపై భేటీని వాయిదా వేసి ఉండాల్సిందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.