మోడీ జీ.. దమ్ముంటే అమెరికాపై 75 శాతం సుంకాలు విధించండి: కేజ్రీవాల్ ఛాలెంజ్

మోడీ జీ.. దమ్ముంటే అమెరికాపై 75 శాతం సుంకాలు విధించండి: కేజ్రీవాల్ ఛాలెంజ్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దమ్ముంటే.. ఇండియాపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలకు ప్రతీకారంగా అమెరికాపై 75 శాతం టారిఫ్‎లు విధించాలని ఛాలెంజ్ చేశారు. ఓ వైపు ఇండియాపై అమెరికా ఎడాపెడా సుంకాలు విధిస్తుంటే.. 2025, డిసెంబర్ 31 వరకు అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఆదివారం (సెప్టెంబర్ 7) కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మోడీ సర్కార్‎పై విరుచుకుపడ్డారు. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75 శాతం టారిఫ్ విధించడం ద్వారా ప్రధాని మోడీ కొంచెమైనా ధైర్యం ప్రదర్శించాలని కోరారు.

‘‘అమెరికా సుంకాల విషయంలో ప్రధాని మోడీ కొంచెం ధైర్యం చూపించాలని మేం కోరుతున్నాం. దేశం మొత్తం మీ వెనుక ఉంది. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించింది. మీరు అమెరికా నుండి వచ్చే దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. దేశం దానిని భరించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ట్రంప్ తలవంచుకుంటారో లేదో చూడండి’’ అని అన్నారు కేజ్రీవాల్. 

అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని మినహాయిస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం స్థానిక రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తుందని.. అమెరికన్ వ్యవసాయదారులను సంపన్నం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ విధానం వల్ల అక్టోబర్-నవంబర్‎లో భారత పత్తి ఉత్పత్తిదారుల పరిస్థితి దుర్బలంగా మారుతుందని.. వారి ఉత్పత్తులను విక్రయించడానికి సరైన మార్కెట్ ఉండదని అన్నారు. పంట పెట్టుబడి కోసం అప్పులు చేసిన రైతులు సరైన ధర లేక అప్పుల భారంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు మోకారిల్లిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఒత్తిడితో మోడీ సర్కార్ 11 శాతం సుంకాన్ని తొలగించడం ద్వారా దేశంలోని రైతులను ఆత్మహత్యలకు పాల్పడేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సుంకాలకు తీవ్రంగా స్పందించడానికి బదులుగా మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 

అమెరికా సుంకాలకు ప్రతీకారంగా ఇండియా కూడా టారిఫ్‎లు విధిస్తే ట్రంప్ తలవంచాల్సి వచ్చేదని అభిప్రాయపడ్డారు. అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తిరిగి విధించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధరను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేజ్రీవాల్. అలాగే దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.