
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో కనిపించిన శివలింగానికి కార్బన్ డేటింగ్‌తో సహా శాస్త్రీయ సర్వేను నిర్వహించరాదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో వీడియోగ్రాఫిక్ సర్వేలో వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు శివలింగం కనిపించింది. అయితే ఈ శివలింగానికి కార్బన్ డేటింగ్‌ను అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
మే 16, 2022న జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో శివలింగం ఆకారం బయటపడింది. దీంతో అక్కడ శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ హిందూ ఆరాధకులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కార్బన్ డేటింగ్ (వయసు నిర్ధారణ కోసం) సహా సైంటిఫిక్ సర్వేకు పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో శివలింగం అకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాసి మసీద్ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై మే 19వ తేదీ శుక్రవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. జ్ఞాన్‌వాపి మసీదు కేసు సున్నితమైన అంశమని..ఈ విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించింది. తొందరపాటు వద్దని... ఈ క్రమంలోనే శాస్త్రీయ సర్వేపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
హిందూ ఆరాధకులు వాదనను జ్ఞానవాసి మసీదు కమిటీ వ్యతిరేకిస్తోంది. మసీదులోని అకారం శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తున్నాయి. కానీ ముస్లిం వర్గాలు మాత్రం అకారం పజూఖానా రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతున్నాయి. ఇప్పటికే శివలింగం అకారంపై వీడియో రికార్డింగ్ సర్వే కూడా నిర్వహించారు. ప్రార్ధనా స్థలాల చట్టం-1991ను.. జ్ఞానవాసి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోర్టును కోరింది. కానీ జ్ఞానవాద్ మసీదుకు ఈ చట్టం వర్తించదని అలహాబాద్ కోర్టు తీర్పు చెప్పింది.
మరోవైపు జ్ఞానవాసి మసీదు కాశీ విశ్వనాథ్ ఆలయ ఆవరణలో భాగమేనని 2021 ఆగస్టు 18న అయిదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీ దేవి, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించడంతో జ్ఞానవాసి మసీదుపై వివాదం తెరపైకి వచ్చింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే జ్ఞానవాసి మసీదు ఉంది. శివలింగం కార్బన్ డేటింగ్, శాస్త్రీయ సర్వే కోసం పెట్టుకున్న దరఖాస్తును 2022 అక్టోబర్ 14న వారణాసి జిల్లా జడ్జి తిరస్కరించగా...మే 12 2023న అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. శివలింగం పై శాస్త్రీయ పరిశోధన జరపాలని హిందూ ఆరాధకులు పెట్టుకున్న దరఖాస్తుపై చట్ట ప్రకారం కొనసాగాలని వారణాసి జిల్లా కోర్టును అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు మాత్రం తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేసింది.
కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి..
కార్బన్ డేటింగ్ అనేది ఆర్గానిక్ పదార్థాలు కలిగిన ఏదైనా వస్తువు వయస్సు తెలుసుకునే పద్ధతి. ఈ పద్ధతిని 1940లో విల్లార్డ్ లిబ్బీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ పద్ధతి పురాతత్వ శాస్త్రవేత్తలకి బాగా ఉపయోగపడుతుంది. రేడియో కార్బన్ మూలకం నైట్రోజన్, కాస్మిక్ రేస్ కలవడం ద్వారా అనునిత్యం ఏర్పడుతూనే ఉంటుంది. ఇలా ఏర్పడ్డ రేడియా కార్బన్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి రేడియో యాక్టివ్ కార్బన్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కల్లోకి చేరుతుంది. జంతువులు ఈ మొక్కలను తినడం ద్వారా అది వాటి శరీరంలోకి చేరుతుంది. ఆ చెట్లు గానీ జంతువులు గానీ చనిపోయినప్పుడు వాటిలో ఉన్న రేడియో కార్బన్ నెమ్మదిగా నశించడం ప్రారంభిస్తుంది. దీన్నే రేడియోయాక్టివ్ డికే అని వ్యవహరిస్తారు. ఏదైనా కొయ్య, లేదా చనిపోయిన కళేబరం లేదా ఎముకలో ఈ రేడియో కార్బన్ ను కొలవడం ద్వారా అది ఎంత పాతదో కనుక్కోవచ్చు. వస్తువు ఎంత పాతదైతే అందులో అంత తక్కువ రేడియోకార్బన్ ఉంటుంది. రేడియోకార్బన్ అర్ధజీవిత కాలం సుమారు 5,730 ఏళ్ళు. కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి సుమారు 50 వేల ఏళ్ళ వయసు కలిగిన వస్తువులను కనుక్కోవచ్చు.