హెచ్1బీ వీసాలపై ట్రంప్ పిడుగు: వార్షిక ఫీజు లక్ష డాలర్లకు పెంపు.. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్లకే చాన్స్: ట్రంప్

హెచ్1బీ వీసాలపై ట్రంప్ పిడుగు: వార్షిక ఫీజు లక్ష డాలర్లకు పెంపు.. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్నోళ్లకే చాన్స్: ట్రంప్
  • ఈ నిర్ణయంపై అమెరికన్ కంపెనీలూ సంతోషిస్తాయని కామెంట్ 
  • ఈ నెల 21 తెల్లవారుజామున 12.01 గంటలు డెడ్​లైన్ 
  • ఆ టైం దాటాక.. లక్ష డాలర్లు చెల్లిస్తేనే ఎంట్రీ
  • వీసా ఫీజు పెంపుతో భారత్​పైనే తీవ్ర ప్రభావం పడే చాన్స్
  • యూఎస్ బయట ఉన్న హెచ్1బీ వీసాదారులు  24 గంటల్లో తిరిగి వచ్చేయాలని టెక్ కంపెనీల పిలుపు
  • హెచ్1బీ వీసాదారుల్లో 71% మంది ఇండియన్లు.

వాషింగ్టన్: ఇప్పటివరకు టారిఫ్​లతో ఇండియా సహా అనేక దేశాలకు ఝలక్ ఇచ్చిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. అమెరికాలోకి వలసలను కట్టడి చేయడంలో భాగంగా హెచ్1బీ వీసా వార్షిక ఫీజును 1,500 డాలర్ల (రూ. 1.32 లక్షలు) నుంచి ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకు) పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం (ఈ నెల 21) తెల్లవారుజామున 12.01 గంటల నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ట్రంప్ ఈ మేరకు శుక్రవారం వైట్​హౌస్​లో ఒక ప్రొక్లమేషన్ (ప్రకటన)పై సంతకం చేశారు.

హెచ్1బీ వీసా ప్రోగ్రాంను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇది దేశ భద్రతకే ముప్పుగా మారిందని ట్రంప్​ పేర్కొన్నారు. ఇకపై అమెరికాకు అత్యంత ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులే రావాలని, అలాగే వారు అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేసేలా ఉండొద్దని స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రొక్లమేషన్ 2016 సెప్టెంబర్ 21 వరకూ ఎలాంటి మార్పులు చేయకపోతే 12 నెలలపాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత హెచ్1బీ లాటరీ తీసిన అనంతరం 30 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రెన్యువల్​పై ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రాంకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పైనా ట్రంప్ సంతకం చేశారు. 

సులభంగా గ్రీన్ కార్డ్ పొందేందుకు వీలు కల్పించే గోల్డ్ కార్డ్ వీసా కావాలనుకునేవారు 10 లక్షల డాలర్లు, కంపెనీలు అయితే 20 లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు చర్యలతో అమెరికా ఖజానాకు వందల కోట్ల డాలర్ల నిధులు సమకూరుతాయని ట్రంప్ తెలిపారు. అయితే, హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో ప్రధానంగా ఇండియాపైనే గణనీయమైన ప్రభావం పడనుంది. అమెరికా ఏటా జారీ చేసే హెచ్1బీ వీసాల్లో 71%  ఇండియన్లు, 11.7% వీసాలను చైనీస్ స్కిల్డ్ వర్కర్లే పొందుతుంటారు. దీంతో ఈ వీసా ఫీజు పెంపుతో ఇండియన్ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది.

అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నయ్..  

విదేశాలకు చెందిన హై స్కిల్డ్ ఉద్యోగుల సేవలను తాత్కాలికంగా అమెరికాలో వినియోగించుకునేందుకు హెచ్1బీ వీసా ప్రోగ్రాంను ప్రారంభించారని, కానీ తక్కువ శాలరీలు, తక్కువ స్కిల్స్ ఉన్న అమెరికన్ వర్కర్లకు అడిషనల్​గా తీసుకుంటున్న హెచ్1బీ వీసాదారులు అమెరికన్ల స్థానంలో ఉద్యోగాలను పొందుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా హెచ్1బీ వీసా ప్రోగ్రాం దుర్వినియోగం కావడం అనేది జాతీయ భద్రతకే ముప్పుగా పరిణమించిందన్నారు. 

‘‘హెచ్1బీ పేరుతో వీసా మోసాలు, మనీలాండరింగ్​కు పాల్పడుతున్న, ఫారిన్ వర్కర్లను ప్రోత్సహించేందుకు అక్రమ కార్యకలాపాలు చేస్తున్న కంపెనీలను అధికారులు గుర్తించారు. అందుకే హెచ్1బీ వీసా ప్రోగ్రాం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కంపెనీలపై అధిక ఆర్థిక భారం వేస్తున్నాం. దీనివల్ల కంపెనీలు ఇకపై అత్యవసరమైన, హైస్కిల్డ్ ఫారిన్ వర్కర్లను మాత్రమే తీసుకుంటాయి. ఈ నిర్ణయంపై టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయి” అని ట్రంప్ తెలిపారు. ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసా సిస్టంను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రధానంగా కంప్యూటర్ సంబంధిత రంగాల్లో అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు.

ఫ్లైట్ ఎక్కినోళ్లూ దిగిపోయారు.. 

ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత హెచ్1బీ వీసాదారులు అమెరికాలోకి రావాలంటే లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి రావడంతో కంపెనీలన్నీ అలర్ట్ అయ్యాయి. వర్క్, వెకేషన్​లో భాగంగా అమెరికా వెలుపల ఉన్న హెచ్1బీ వీసా హోల్డర్లు, వారి ఫ్యామిలీ మెంబర్లు వెంటనే 24 గంటల్లో తిరిగి రావాలని అమెరికన్ కంపెనీలు సూచించాయి. ఆ డెడ్ లైన్​లోపు తిరిగి రాకుంటే విదేశాల్లోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాయి. దీంతో ఇండియాలో ఉన్న హెచ్1బీ హోల్డర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 

ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైన హెచ్1బీ హోల్డర్లు ట్రంప్ ప్రకటన తర్వాత టూర్లను రద్దు చేసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో విమానం ఎక్కినవారు సైతం వెంటనే దిగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, డెడ్ లైన్ ఒక్కరోజే ఉండటంతో ప్రస్తుతం ఇండియాలో ఉన్న హెచ్1బీ వీసాదారులు ఆ డెడ్ లైన్​లోపు అమెరికాకు వెళ్లడం అసాధ్యమని చెప్తున్నారు. డైరెక్ట్ ఫ్లైట్ లేనందున డెడ్ లైన్ లోపు అక్కడికి చేరుకునే చాన్స్ లేదని, కానీ కాలిఫోర్నియాకు మాత్రం చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.

డెడ్ లైన్ దాటితే నో ఎంట్రీ..  

ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న హెచ్1బీ వర్కర్లు డెడ్ లైన్ దాటాక అమెరికాలోకి ప్రవేశించాలంటే వార్షిక ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ పేర్కొన్నారు. లక్ష డాలర్ల ఫీజు చెల్లించకపోతే అమెరికాలోకి ఎంట్రీని అడ్డుకోవాలని హోంలాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. 

అయితే, దేశ ప్రయోజనాల కోసమే కంపెనీలు, ఇండస్ట్రీలు హెచ్1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్లను నియమించు కుంటే.. వారితో దేశ భద్రత, సంక్షేమానికి ఎలాంటి ప్రమాదం లేని భావిస్తే.. మాత్రం ఈ ఆంక్షలు వర్తింపచేయొద్దని సూచించారు. కాగా, ట్రంప్ నిర్ణయం దారుణంగా ఉందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అమెరికన్ చట్టసభల సభ్యులు, ఇండియన్ కమ్యూనిటీ లీడర్లు మండిపడ్డారు. 

ఏమిటీ హెచ్1బీ వీసా? 

అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను తీసుకునేందుకు తాత్కాలికంగా ఇచ్చే వర్క్ వీసానే హెచ్1బీ వీసా. కనీసం బ్యాచిలర్ డిగ్రీ, అంతకంటే పైచదువులు చదివి.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీయులను అమెరికాలోకి రప్పించేందుకు గాను 1990లో హెచ్1బీ వీసా ప్రోగ్రాంను తెచ్చారు. 

ఈ వీసాను ముందుగా 3 ఏండ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. తర్వాత దీనిని గరిష్టంగా మరో 3 ఏండ్ల వరకూ పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే, గ్రీన్ కార్డ్ పొందినవారికి ఈ వీసాను నిరవధికంగా రెన్యువల్ చేసుకునే చాన్స్ ఇస్తారు. ఈ వీసాదారులకు అమెరికన్లతో సమానంగా జీతభత్యాలను ఇవ్వాలి. అలాగే హెచ్1బీ వీసాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలే ఈ ఫీజు కూడా భరిస్తున్నాయి.

అంతిమంగా మనకే మేలు

హెచ్1బీ వీసా ఫీ హైక్‌‌‌‌ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాకే నష్టం ఎక్కువ. అమెరికాలోని భారత టాలెంట్ స్వదేశానికి తిరిగి వస్తుంది. ఇది మన దేశాన్ని టర్బోచార్జ్ చేస్తుంది. దీంతో మన ఆర్థిక వృద్ధి మరింత బలంగా ముందుకు సాగుతుంది. ప్రతిభకు డోర్ క్లోజ్ చేయడం వల్ల అమెరికాకు వెళ్లాల్సిన తదుపరి ల్యాబ్‌‌‌‌లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌‌‌‌లన్నీ..బెంగళూరు, హైదరాబాద్, పుణె, గుర్గావ్‌‌‌‌ల వైపు వచ్చేస్తాయి. 

దాంతో దేశంలోని అత్యుత్తమ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇన్నోవేటర్లు ఇకపై భారత వృద్ధికి దోహదపడతారు.  అందుకే ట్రంప్ నిర్ణయం అమెరికాకు నష్టం, మన దేశానికి లాభం చేకూరుస్తుంది. 

-అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో

అనర్హులను పంపించేయండి

పాత ఇమ్మిగ్రేషన్ పాలసీతో హెచ్1బీ వీసాలిచ్చి విదేశీయులను అమెరికాకు రప్పించే పిచ్చి పనులను కంపెనీలన్నీ  వెంటనే ఆపేయాలి. ఏటా లక్ష డాలర్లు చెల్లించి నియమించుకోవడానికి విదేశీ వ్యక్తులకు నిజంగా అర్హత ఉందా? లేదా కంపెనీలే నిర్ణయం తీసుకోవాలి. అత్యుత్తమమైన ట్యాలెంట్, విలువైన విదేశీ వ్యక్తులకు మాత్రమే జాబులు ఇవ్వాలి. ఏటా లక్ష డాలర్లు చెల్లించేందుకు అర్హతలేని విదేశీయులను వెంటనే తిరిగి పంపేయండి. మీరు ఇకపై ఎవరికైనా జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప వర్సిటీల నుంచి పట్టభద్రులైన మనవారికే ఇవ్వండి. 

-హోవార్డ్‌‌‌‌ లుట్నిక్‌‌‌‌, అమెరికా వాణిజ్య మంత్రి

అమెరికాకే మనోళ్లు అవసరం

హెచ్1బీ వీసాపై పరిమితులు ఇండియాకు ప్రయోజనకరంగా మారే అవకాశాలున్నాయి. ఈ నిర్ణయంతో అమెరికాకే నష్టం జరుగుతుంది. ఇండియన్ నిపుణుల అవసరం అమెరికాకు చాలా ఉంది. హెచ్1బీ వీసా చార్జీలు పెంచడం వల్ల  భారతదేశానికి చెందిన టెక్ నిపుణులు అమెరికా వెళ్లడం కష్టమవుతుంది. దీంతో వారు ఇక్కడే ఉండే అవకాశాలున్నాయి. 

ఇది దేశీయ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్​తో పాటు స్టార్టప్​ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. టాలెంట్ ఉన్నవాళ్లు ఇండియాలోనే ఉంటే ఇక్కడే ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఈ మార్పులతో ఇండియా సొంత టెక్నికల్​పవర్, డిజిటల్ శక్తిగా ఎదిగే చాన్స్ ఉంటుంది.

-అల్లిపురం రాజశేఖర్ రెడ్డి రిటర్న్ ఎన్ఆర్ఐ, టెక్ వ్యాపారవేత్త


ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య 

అమెరికా– ఇండియా మధ్య సంబంధాలు ఎఫెక్టయ్యాయనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. హెచ్1బీ వీసాలు వాడుకొని టెక్ కంపెనీలు చాలా లాభాలు గడిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఆలోచనల మేరకు వలసదారులను ఆపాలంటే ఎక్కడో ఒక అడుగుపడాలి. అందులోని మొదటి అడుగే ఈ చర్య. భారత్ కూడా మన దేశం వచ్చేయండి, మనం శక్తిమంతం అవుదాం అని వెనక్కి వచ్చే వాళ్లకు భరోసా ఇవ్వాలి.

-శిరీష్, హైద్రాబాద్ వాసి, అమెరికా నుంచి

అమెరికాలో ఉద్యోగం చేయడం కష్టమే..

ఇక అమెరికాలో ఉద్యోగం చేయడం కష్టమే. హెచ్1బీ వీసాకు లక్ష డాలర్లు చెల్లించాలంటే వచ్చే జీతమంతా దానికే సరిపోతుంది. కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం వెళితే అక్కడ  ఏడాదికి లక్ష డాలర్ల లోపే జీతం వస్తుంది. అదే కంపెనీల తరఫున వెళితే లక్ష నుంచి లక్ష 30 వేల డాలర్లు వస్తుంది. ఇలాంటి ఉద్యోగులు ఇకపై అమెరికా వెళ్లరు. 

ఇండియాలోనే ఉద్యోగం చేసుకొని వచ్చిన దాంతో సరిపెట్టుకుంటారు. రెండేండ్ల కోసారి వీసా ఎక్స్ టెన్షన్ కోసం, అప్లయ్ కోసం ఇండియాకు కచ్చితంగా తిరిగి రావాలి. అప్పుడు కూడా లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇలా వచ్చే ఏడాది మార్చిలో 90% మంది వరకు హెచ్1బీ కోసం అప్లయ్ చేయరని భావిస్తున్న. ట్రంప్ ఉన్నంత వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.

-శ్రీకాంత్, టెక్ మహీంద్రా ఐటీ ఉద్యోగి, హైదరాబాద్ 

హెచ్ 1బీ వీసాదారులు  ఎక్కువగా ఉన్న టాప్ కంపెనీలు ఇవే..

  • అమెజాన్ సర్వీసెస్ ఎల్ఎల్ సీ      10,044
  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్                5,505
  • మైక్రోసాఫ్ట్                                             5,189
  • మెటా ప్లాట్ ఫామ్స్                              5,123
  • యాపిల్                                                4,202
  • గూగుల్ ఎల్ఎల్ సీ                              4,181
  • కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్    2,493
  • 8. జేపీ మోర్గాన్ ఛేస్ అండ్ కో               2,440
  • 9. వాల్ మార్ట్ అసోసియేట్స్                  2,390
  • 10. డెలాయిట్ కన్సల్టింగ్ ఎల్ఎల్ పీ   2,353
  • 11. ఇన్ఫోసిస్                                          2,004
  • 12. విప్రో                                                  1,523
  • 13. టెక్ మహీంద్రా అమెరికాస్               951