ముంబై ఉగ్రదాడుల సూత్రధారికి 31 ఏళ్ల జైలు

ముంబై ఉగ్రదాడుల సూత్రధారికి 31 ఏళ్ల జైలు

ఇస్లామాబాద్ : ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్థాన్ కోర్టు 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసులకు సంబంధించి విచారణ ముగించిన ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. పాక్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్ అక్రమంగా నిర్మించిన మసీదు, మదర్సాను సీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్కు జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి 2020లో యాంటీ టెర్రర్ కోర్టు ఆయనకు15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2019లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటన సమయంలో హఫీజ్ సయీద్ను అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతని ప్లాన్ మేరకే పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టులు సముద్రమార్గం ద్వారా ముంబైలోకి చొరబడి పలు ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 175 మంది మృతి చెందగా.. 300 మందికిపైగా గాయపడ్డారు.