హైతీలో భూకంపం: 1297 కు చేరిన మృతులు

హైతీలో భూకంపం: 1297 కు చేరిన మృతులు

కరీబియన్ దేశం హైతీని భారీ భూకంపం అతలాకుతలం చేసింది. రిక్టర్ స్కేల్ పై 7.2 పాయింట్ గా నమోదైన భూకంప తీవ్రతకు హైతీ వణికిపోయింది. అనేక ఇళ్లు పేకమేడలా కూలిపోయాయి. భూకంపం కారణంగా 12 వందల 97 మంది  ఇప్పటివరకు చనిపోయినట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. 2వేల 800 మంది గాయపడ్డారు. దక్షిణ హైతీలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. అక్కడే ఇప్పటివరకు 500 మంది చనిపోయినట్టు రికార్డులు చెబుతున్నాయి. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నిన్న సాయంత్రం వరకు 13వేల 600 ఇళ్లు పూర్తిగా కూలిపోయినట్టు లెక్కలు తీశారు. మరో 17వేల 700  ఇళ్లు దెబ్బతిన్నాయి. 

శనివారం సాయంత్రం రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ కు దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. తీర ప్రాంత సిటీ అయిన లెస్ కేయస్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. భూమి కంపిస్తున్న విషయాన్ని గమనించిన ప్రజలు బయటకు పరుగులు తీసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు లేస్ కేయస్ సిటీని సునామీ హెచ్చరికలు భయపెడుతున్నాయి. 

ఈ మధ్యే హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోయిజ్ హత్య జరిగింది. ఆ దారుణం నుంచి హైతీ ఇంకా తేరుకోలేదు. ప్రభుత్వం కూడా సెట్ కాలేదు. అంతలోనే భూకంపం దేశాన్ని దారుణంగా దెబ్బతీసింది. మరోవైపు భారీ వర్షాలు, వరదలు హైతీని ఇబ్బందిపెడుతున్నాయి. అయినప్పటికీ సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తోంది హైతీ ప్రభుత్వం. యాక్టివ్ ప్రెసిడెంట్ ఏరియల్ హెన్రీ వేగంగా స్పందించారు. దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు వేలాది సిబ్బంది సహాయక చర్యల నిమిత్తం పంపించారు. అమెరికా సహా ఇతర దేశాలు హైతీకి సాయం అందిస్తామని ప్రకటించాయి.