హైతీ దేశాధ్యక్షుడి దారుణ హత్య

హైతీ దేశాధ్యక్షుడి దారుణ హత్య
  • సొంత ఇంట్లో ఉండగా దుండగుల కాల్పుల్లో మృతి

హైతీ దేశ అధ్యక్షుడు జావెనెల్‌ మోసె దారుణ హత్యకు గురయ్యారు. తన సొంత ఇంట్లో ఉండగా ఈ హత్య జరిగినట్లు సమాచారం. దుండగుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆయన హత్య నిజమేనని తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ మీడియాకు ధృవీకరించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. 53ఏళ్ల వయసున్న యువ దేశాధ్యక్షుడు జావెనెల్ తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు దుండగులు దారుణానికి ఒడిగట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. 
అధ్యక్షుడి సతీమణి మార్టిన్ మోయిస్ దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడడంతో ఆమెను ఆస్పత్రికి తరలించామని.. కొంత మంది సాయుధ కమాండోలు ఇంట్లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించారు. ఇప్పుడు దేశానికి బాధ్యత వహిస్తున్నానని ప్రధాని జోసెఫ్ చెప్పారు. దేశాధ్యక్షుడి దారుణ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. "ద్వేషపూరిత, అమానవీయ మరియు అనాగరిక చర్య.. రాజకీయ మరియు ఆర్ధిక అస్థిరత్వం సృష్టించడం కోసం ఇలాంటి దారుణగాలకు ఒడిగట్టడం సహించరానిదని.. హైతీ యొక్క జాతీయ పోలీసులు మరియు ఇతర అధికారులు కరేబియన్ దేశంలో పరిస్థితిని అదుపులో ఉంచారు.. ’’ అని ప్రధాని జోసెఫ్ మీడియాకు వివరించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.