హజీపూర్ హత్యల కేసులో కొనసాగుతున్న విచారణ

హజీపూర్ హత్యల కేసులో కొనసాగుతున్న విచారణ
  • ఐడీ కార్డులు దొరికినయ్
  • కుంటలో మనీష ఆధార్​
  • ముళ్లపొదల్లో కల్పన స్కూల్ ఐడీ
  • కీలక విషయాలు వెల్లడించిన శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన హాజీపూర్​బాలికల హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. శ్రీనివాస్​రెడ్డిని కస్టడీకి తీసుకున్న పోలీసులు అతని నుంచి కీలక విషయాలను రాబట్టారు. డిగ్రీ విద్యార్థి మనీషను శ్రీనివాస్​రెడ్డి హత్య చేసి మర్రిబావిలో పూడ్చి పెట్టాడు. శ్రావణి మృతదేహం బయటపడిన మరుసటి రోజు అదే బావిలో మనీష మృతదేహాన్ని సైతం పోలీసులు కనిపెట్టారు. మృతదేహంతోపాటు మనీషకు సంబంధించిన బ్యాగును గుర్తించారు. ఈ బ్యాగులో మనీష చదువుతున్న కాలేజీ గుర్తింపు కార్డు, సెల్​ఫోన్​ పౌచ్​, పుస్తకాలు ఉన్నాయి. అయితే శ్రీనివాస్​రెడ్డి మనీషను హత్య చేసిన అనంతరం ఆమె ఆధార్​కార్డు, సెల్​ఫోన్​ను బొమ్మలరామారం పోలీస్​స్టేషన్​ వెనకవైపున ఉన్న తడకలమ్మ కుంటలో పడేశాడు.

కల్పన హత్య అనంతరం ఆమెకు సంబంధించిన స్కూల్​ ఐడీ కార్డును మైసిరెడ్డిపల్లికి వెళ్లే బాటలో ముళ్లపొదల్లో దాచిపెట్టాడు. కస్టడీలో ఉన్న శ్రీనివాస్​రెడ్డి ఈ రెండు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడంతో భువనగిరి ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో  పోలీసులు తనిఖీలు చేశారు. హాజీపూర్​నుంచి మైసిరెడ్డిపల్లికి వెళ్లే పిల్లబాటలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో కల్పన స్కూల్​ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బొమ్మలరామారం పోలీస్​స్టేషన్​ వెనకభాగంలో ఉన్న తడకలమ్మకుంటలో ఆధార్​కార్డు, సెల్​ఫోన్​ కోసం గాలించారు. మొత్తం బురదగా ఉన్నా అందులోనే వెతికారు. మనీష ఆధార్​కార్డు ఆ బురదలో దొరికింది. సెల్​ఫోన్​ కోసం చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సంఘటన స్థలానికి మెటల్​ డిటెక్టర్​ను తెప్పించారు.  బురద ఎక్కువగా ఉండడం, మెటల్​డిటెక్టర్​కు కూడా సెల్​ఫోన్​దొరకకపోవడంతో తనిఖీలు నిలిపివేశారు. సోమవారం మరోసారి సెల్​ఫోన్​ కోసం తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

కల్పనను చంపి.. మూటలో తీసుకువచ్చి…

ప్రస్తుతం కల్పన ఐడీ కార్డు లభించిన స్థలం వద్దే ఆమెను హతమార్చి ప్లాస్టిక్ బ్యాగులో మూటకట్టు కు వచ్చి మర్రిబావి సమీపంలోని మరో బావిలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన ప్రదేశం నుంచి బావి ఎంత దూరం ఉంది అని పోలీసులు కొలిచారు. హత్య ప్రదేశం కల్పన మృతదేహాన్ని పాతిపెట్టిన బావికి సుమారు కిలోమీటర్ ​దూరంలో ఉందని తేల్చారు. సైకో కిల్లర్​ శ్రీనివాస్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని బాలికల ఆధార్​కార్డు, సెల్​ఫోన్​ సమాచారం రాబట్టిన పోలీసులు, మరిన్ని కీలక విషయాలను రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బావులలో దొరికిన మూడు శవాలతో పాటు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.