రైతులకు హమాలీ చార్జీలు బకాయిపడిన ప్రభుత్వం

రైతులకు హమాలీ చార్జీలు బకాయిపడిన ప్రభుత్వం
  • స్టేట్​వైడ్​ రూ.500 కోట్లకు పైగా బకాయిలు
  • వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచే వసూలు
  • క్వింటాల్​ వడ్లపై రూ.20 నుంచి రూ.25 
  • తిరిగి చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్ఎస్ ​సర్కారు

మహబూబాబాద్, వెలుగు: కొనుగోలు సెంటర్లలో వడ్లను తూకం వేసి లోడ్​చేసే హమాలీలకు రైతుల నుంచి చార్జీలను ఇప్పిస్తున్న సర్కారు ఆ డబ్బులను తిరిగి చెల్లించడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ముందుగా రైతులు చెల్లిస్తే, ఆ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో తిరిగి వేస్తామని చెప్పిన  ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటి వరకు పైసా చెల్లించలేదు. క్వింటాల్​వడ్లపై రూ.25 దాకా వసూలు చేసి హమాలీలకు ఆఫీసర్లు ఇప్పిస్తున్నారు, రైతులు ఆ డబ్బులు గురించి అడిగితే మాత్రం మాట దాటేస్తున్నారు. రేపు.. మాపు అంటూ ఏండ్లు గడుస్తున్నాయే తప్ప రైతుల అకౌంట్లలో హమాలీ చార్జీలు పడడం లేదు. గడిచిన నాలుగేండ్లలో సర్కారు.. స్టేట్​వైడ్ ​వడ్లు అమ్మిన రైతులకు ఏకంగా రూ.500 కోట్లకు పైగా బకాయి పడినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.20 
ప్రభుత్వం ఏటా యాసంగి, వానకాలం సీజన్లలో ఐకేపీ సెంటర్లు, పీఏసీఎస్ లు, మెప్మా, జీసీసీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోళ్లు చేపడుతోంది. రైతులే రవాణా ఖర్చులు భరించి కొనుగోలు సెంటర్లకు వడ్లు తెస్తుండగా, తూకం వేసి, లోడింగ్​చేసే హమాలీలకు ఇవ్వాల్సిన చార్జీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది.  క్వింటాల్​కు రూ.20 చొప్పున చెల్లించే ఈ మొత్తంలో రూ.5 కేంద్రం తన వాటాగా ఇస్తోంది. మిగిలిన రూ.15ను సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. గతంలో క్వింటాల్​కు రూ.20 చొప్పున ప్రభుత్వమే స్వయంగా సెంటర్ల నిర్వాహకులకు చెల్లించేది. కానీ కొన్నేళ్లుగా సర్కారు నుంచి హమాలీ చార్జీలు రాకపోవడంతో సెంటర్లలోని నిర్వాహకులు రైతుల నుంచే ఇప్పిస్తున్నారు. మొదట మీరు డబ్బులు ఇవ్వండి... ప్రభుత్వం రిలీజ్ చేశాక ఆ మొత్తాన్ని మీ అకౌంట్లలో తిరిగి జమ చేస్తామని రైతులతో చెబుతున్నారు.

పెరిగిన హమాలీ రేట్లు
తూకం టైంలో రైతుల నుంచి నయానో, భయానో హమాలీ చార్జీలను వసూలు చేస్తున్న ఆఫీసర్లు తిరిగి ఇప్పించడంపై ఫోకస్​ పెట్టడం లేదు. గడిచిన నాలుగేండ్లలో హమాలీ చార్జీల రూపంలో రైతులకు ప్రభుత్వం రూ.500 కోట్లు బకాయి పడింది. 2017 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క సీజన్​కు సంబంధించిన హమాలీ చార్జీలను రైతుల  అకౌంట్లలో వేయలేదు. ఎవరైనా రైతులు అడిగితే రేపు మాపు అని తప్పించుకు తిరుగుతున్నారు. సర్కారు నుంచి ఫండ్స్​ రాగానే ఖాతాల్లో వేస్తామని చెబుతున్నారు. కాగా, హమాలీలు గతంలో  క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.25 వరకు వసూలు చేయగా, ప్రస్తుతం రూ.30, కొన్నిచోట్ల రూ.35 దాకా వసూలు చేస్తున్నారు. హమాలీల కొరత ఉన్నచోట్ల రూ.50 వరకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇది రైతుల నెత్తిన మరో భారంగా తయారైంది. ఇప్పటికైనా సర్కారు స్పందించి పాత బకాయిలను ఇప్పించడంతో పాటు కొత్త హమాలీ చార్జీలను సర్కారే నేరుగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

హమాలీ చార్జీలు చెల్లించాలె
వడ్లు జోకిన ప్రతిసారీ హమాలీ చార్జీలు మాతోనే ఇప్పిస్తున్నరు. క్వింటాల్​కు రూ.25 నుంచి 30 చొప్పున వేలకు వేలు గుంజుతున్నరు. అప్పుడు మా నుంచి బలవంతంగా పైసలు వసూలు చేసి ఇప్పిస్తున్న ఆఫీసర్లు ఇప్పుడేమో తప్పించుకుంటున్నరు. వెంటనే పెండింగ్​ బకాయిలు ఇప్పించాలె.
 - హనుమానాయక్, ఆగపేట, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్​ జిల్లా