సౌత్ గాజాకు పోనిస్తలె.. జనాలను అడ్డుకుంటున్న మిలిటెంట్లు

సౌత్ గాజాకు పోనిస్తలె.. జనాలను అడ్డుకుంటున్న మిలిటెంట్లు
  • హమాస్​ను ముక్కలు చేస్తమన్న నెతన్యాహు.. కేబినెట్​తో భేటీ
  • గాజాపై ముప్పేట దాడికి బలగాలు సిద్ధం
  • రాజకీయ నిర్ణయం కోసమే అధికారుల వెయిటింగ్

జెరూసలెం:ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో నార్త్ గాజా నుంచి సౌత్ గాజాకు వెళ్తున్న పాలస్తీనియన్లను హమాస్ మిలిటెంట్లు అడ్డుకుంటున్నారు. మిలిటెంట్లు ప్రజలను బెదిరిస్తూ అడ్డుకుంటున్న ఫొటోలను ఆదివారం ఐడీఎఫ్ విడుదల చేసింది. సాధారణ ప్రజలను, బందీలను రక్షణ కవచాలుగా వాడుకోవాలని హమాస్ చూస్తోందని విమర్శించింది. అయితే, అధికారికంగా గాజాపై గ్రౌండ్ అటాక్ ప్రారంభం కాకపోయినా.. రెండు రోజులుగా తమ బలగాలు అక్కడక్కడా గాజాలో కి ప్రవేశించి బందీల ఆచూకీ కోసం దాడులు, తనిఖీలు చేస్తున్నాయని ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలోని అండర్ గ్రౌండ్​లో మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న వందలాది కిలోమీటర్ల టన్నెల్స్ కారణంగానే ఐడీఎఫ్ గ్రౌండ్ అటాక్ ఆలస్యం అవుతోంది. పకడ్బందీ ఏర్పాట్లతో ఉన్న టన్నెల్స్ లో దాక్కున్న మిలిటెంట్లతో పోరాటంలో ఇజ్రాయెల్ కూ భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే మిలిటెంట్లు బందీలను, అమాయక ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుంటే.. ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు ఇబ్బందికరంగా మారనుంది. అందుకే గ్రౌండ్ అటాక్ కు సిద్ధమైనా ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నట్లు చెప్తున్నారు.

బలగాలు  సిద్ధంగా ఉన్నయ్: నెతన్యాహు

పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్​పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు  మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హమాస్​ను ముక్కలు ముక్కలుగా విరిచిపారేస్తామని ప్రకటించారు. ఆదివారం ఆయన రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడారు. యుద్ధం నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయి నడిపిస్తున్న యూనిటీ గవర్నమెంట్ శత్రువును అంతం చేసేందుకు 24 గంటలూ కలిసికట్టుగా పని చేస్తోందన్నారు. గాజాపై భూ, గగన, సముద్రతలాల నుంచి ముప్పేట దాడి కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. రాజకీయ నిర్ణయం ప్రకటించిన మరుక్షణమే గాజాపై అటాక్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రధాని నెతన్యాహు ఆధ్వర్యంలో అత్యవసరంగా కేబినెట్ భేటీ జరిగింది.  వాస్తవానికి నార్త్ గాజాను ఖాళీ చేయాలంటూ శుక్రవారమే ఐడీఎఫ్ హెచ్చరికలు జారీచేసింది. దీంతో లక్షలాది మంది పాలస్తీనియన్లు సౌత్ గాజాకు తరలిపోతున్నారు.

గత 5 యుద్ధాలకు మించిన మరణాలు
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన గత ఐదు యుద్ధాల కంటే అత్యధికంగా ఈ యుద్ధంలో మృతుల సంఖ్య పెరిగిందని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 2,329 మంది పాలస్తీనియన్లు చనిపోయారని ప్రకటించింది. తాజా యుద్ధంలో హమాస్ దాడుల్లో 1,300 మంది ఇజ్రాయెలీలు మరణించారు. దీంతో యుద్ధంలో రెండువైపులా మరణాల సంఖ్య 3,600 దాటింది.