
- అక్టోబర్ 7 తరహా దాడులు మరిన్ని ఉంటయ్: ఘాజి హమాద్
- ఇజ్రాయెల్‌ను వరల్డ్ మ్యాప్‌లో లేకుండా చేయడమే టార్గెట్
- పాలస్తీనా కోసం అమరులయ్యేం దుకు మా ఫైటర్లు రెడీగా ఉన్నరు
- తగిన గుణపాఠం చెబుతామన్న హమాస్ అధికార ప్రతినిధి
గాజా/ టెల్ అవీవ్: ఇజ్రాయెల్‌పై మళ్లీ మళ్లీ దాడులు చేస్తామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ చెప్పాడు. అక్టోబర్ 7 తరహా దాడులు మరిన్ని ఉంటాయని హెచ్చరించాడు. పాలస్తీనా భూభాగాన్ని స్వాధీనం చేసుకుని తీరుతామని, అప్పటి దాకా పోరాడుతూనే ఉంటామని చెప్పారు. లెబనాన్‌కు చెందిన ఎల్బీసీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాజి హమాద్ ఈ కామెంట్లు చేశారు. వేలాదిమంది పాలస్తీనియులను ఇజ్రాయెల్ చంపేసిందని మండిపడ్డాడు. ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేదాకా యుద్ధం చేస్తామని ప్రకటించాడు. మెరుపు దాడులు చేసేందుకు తమ గ్రూప్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌కు ఈ భూమిపై చోటు లేదు. ఆ కంట్రీతో అరబ్, ఇస్లామిక్ దేశాలకు ముప్పు పొంచి ఉంది. మేము ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెప్తాం. మళ్లీ.. మళ్లీ.. దాడి చేస్తాం. పాలస్తీనాను అమరవీరుల దేశమని పిలుస్తారు. దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు చాలామంది హమాస్ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారు” అని ఘాజి హమాద్ ప్రకటించాడు.
ఇద్దరు హమాస్ కమాండర్లు హతం..
గాజాలోని జబాలియాలో ఏర్పాటు చేసిన రెఫ్యూజీ క్యాంప్‌పై మంగళ, బుధవారాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు హమాస్ కమాండర్లు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. జబాలియా క్యాంప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 195 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ ప్రకటించింది. 120 మంది అచూకీ తెలియడంలేదని ప్రకటించింది. ఇప్పటిదాకా గాజాలో 9వేల పాలస్తీనియన్లు చనిపోయారు.
రఫా బార్డర్ దాటిన 400 మంది విదేశీయులు
ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో గాయపడిన వారిలో సుమారు 20 వేల మంది ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లోనే ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఫారిన్ పాస్‌పోర్ట్ హోల్డర్లు, పాలస్తీనియన్లను ఈజిప్ట్‌కు తరలించారు. ఇప్పటి దాకా 3,600 మంది పాలస్తీనియన్ చిన్నారులు చనిపోయారు. 23లక్షల మంది గాజా వదిలి వెళ్లిపోయారు. సుమారు 400 మంది విదేశీయులు, 100 మంది గాయపడిన వాళ్లు గురువారం రఫా బార్డర్ దాటినట్లు ఈజిప్ట్ అధికారులు తెలిపారు.
పిల్లల ఏడుపు ఆగేదాకా డోర్‌పై కాల్పులు జరిపాం: హమాస్ మిలిటెంట్
ఇజ్రాయెల్‌లో అక్టోబర్7న చేసిన దాడిలో ఓ ఇంట్లో దాక్కున్న పిల్లలపై ఏడుపులు ఆపే వరకు కాల్పులు జరిపామని ఇజ్రాయెల్సైన్యం అదుపులో ఉన్న హమాస్ మిలిటెంట్చెప్పాడు. ఆ రోజు జరిగిన దాడి విషయాలను హమాస్ మిలిటెంట్కళ్లకు కట్టినట్లు చెబుతున్న ఓ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం ట్వీట్ చేసింది. ఈ వీడియోలో హమాస్ మిలిటెంట్ మాట్లాడుతూ..“ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన వెంటనే దగ్గర్లో ఉన్న ఓ ఇంటి కిటికీ గుండా లోపలికి వెళ్లాం. ఇల్లంతా వెతికాం. ఓ గదిలో శబ్దాలు వినిపించగా కాల్పులు జరిపాం. ఇంట్లో డ్రైఫ్రూట్స్ తిని, నీళ్లు తాగాం. మరోసారి పిల్లల ఏడుపులు వినిపించడంతో.. డోర్‌పై కాల్పులు జరిపాం. ఏడుపులు ఆగే దాకా కాల్పులు జరుపుతూనే ఉన్నాం’’ అని చెప్పాడు.