నన్న వదిలేయండి.. హమాస్ చెరలో ఇజ్రాయెల్ యువతి వేడుకోలు

నన్న వదిలేయండి.. హమాస్ చెరలో ఇజ్రాయెల్ యువతి వేడుకోలు

ఇజ్రాయెల్​, పాలస్తీనా హమాస్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఏం క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 
ఇజ్రాయెల్ కు చెందిన కొందరు పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. 

చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్‌, ఇతర దేశాల పౌరులకు సంబంధించి ఒక వీడియో బయటికొచ్చింది. ఆ వీడియోలో 21 ఏళ్ల ఫ్రాన్స్‌-ఇజ్రాయెల్‌ యువతి మియా షెమ్‌ చేతికి తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది. ఆమె చేతికి సర్జరీ చేస్తూ.. ఓ వ్యక్తి ఆమెకు కట్టు కడుతున్నారు. ఆ తర్వాత మియా మాట్లాడుతూ వీడియోలో కనిపించింది. 

తన పేరు మియా అని..తమది గాజా సరిహద్దులోని షోహమ్‌ అనే ప్రాంతం అని చెప్పింది. ప్రస్తుతం తాను గాజాలో ఉన్నానంది. అక్టోబరు 7వ తేదీన తాను రీమ్‌ కిబుట్జ్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్‌ పార్టీకి వెళ్లానని, ఆ సమయంలో తన చేతికి తీవ్ర గాయమైందని చెప్పింది. గాజాలో తనకు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందని, వాళ్లు తనను బాగానే చూసుకుంటున్నారని వివరించింది. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పింది. వీలైనంత త్వరగా తనను అక్కడి నుంచి విడిపించాలని, తమ అమ్మనాన్నల వద్దకు చేర్చాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని వేడుకుంది. అయితే.. ఆమె చేతికి ఎలా గాయమైందో మాత్రం వీడియోలో చెప్పలేదు. 

ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్‌ మిలిటరీ విభాగమైన ఇజ్‌ అద్‌-దిన్‌ అల్‌-కస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ సంస్థ మద్దతుదారులు కొందరు ఇతర సోషల్​ మీడియాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

ఇంతకుముందే... మియా కిడ్నాప్‌ను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ కూడా ధ్రువీకరించింది. మియా కుటుంబాన్ని సంప్రదించి.. ఆమె హమాస్‌ చెరలో ఉన్నట్లు చెప్పామని తెలిపింది. అంతేకాదు.. తమ వద్ద బందీలుగా ఉన్న పిల్లలను ఆడిస్తున్న వీడియోను కూడా హమాస్‌ ఈ మధ్యే విడుదల చేసిన విషయం తెలిసిందే. 

హమాస్‌ మిలిటెంట్ల చెరలో దాదాపు 200 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ఇటీవల అధికారికంగా ప్రకటించింది. హమాస్‌ నెట్‌వర్క్‌ను ఛేదించి.. బందీలను విడిపించేందుకు గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది.