హమాస్ స్థావరాలపై బాంబుల వర్షం

హమాస్ స్థావరాలపై బాంబుల వర్షం
  • బంకర్లపై బాంబుల వర్షం: ఇజ్రాయెల్
  • గాజాలో మిలిటెంట్లతో నేరుగా పోరాటం షురూ 
  • ఇంటర్నెట్, ఫోన్లు బంద్.. శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నయ్ 
  •  బయటి ప్రపంచంతో గాజాకు తెగిన సంబంధాలు 
  •  దీటుగా ఎదుర్కొంటామన్న హమాస్

గాజా/జెరూసలెం: రెండ్రోజులుగా గాజాపై రాత్రిపూట దాడులు చేస్తూ పూర్తిస్థాయి గ్రౌండ్ అటాక్ కు రంగం సిద్ధం చేసుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం రాత్రి కూడా హమాస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. రాత్రికిరాత్రే హమాస్ కు చెందిన 150 బంకర్లు, టన్నెల్స్ ను పేల్చేసినట్లు శనివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఈ దాడుల్లో అనేక మంది మిలిటెంట్లు హతమయ్యారని వెల్లడించింది. గత రెండ్రోజులుగా గాజాలోకి వెళ్లి దాడులు చేసి తిరిగి వచ్చిన తమ బలగాలు ప్రస్తుతం బార్డర్​లో పోరాడుతున్నాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగేరి తెలిపారు. తమ సోల్జర్లు హమాస్ మిలిటెంట్లతో నేరుగా పోరాడుతున్నారని చెప్పారు. 

హమాస్ పై తమ పోరాటాన్ని విస్తృతం చేస్తున్నామంటూ శుక్రవారం రాత్రి డేనియల్ ప్రకటించిన కొద్దిసేపటికే గాజాలో ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీస్ లు కట్ అయ్యాయి. దీంతో వారం కిందటే కరెంట్ సప్లై ఆగిపోయి, తిండి, నీళ్లు అయిపోయి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాలస్తీనియన్లకు ఇప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు సైతం తెగిపోయినట్లయింది. ప్రస్తుతం గాజాలో శాటిలైట్ ఫోన్లు మాత్రమే పని చేస్తున్నాయని స్థానిక టెలికం ప్రొవైడర్ పాల్టెల్ వెల్లడించింది. కమ్యూనికేషన్ల బ్లాకౌట్ వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని తెలిపింది. గాజాలో కమ్యూనికేషన్లు కట్ అయిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్​లు బాంబుల మోత మోగించాయి. దీంతో అంధకారం అలుముకున్న గాజా సిటీలో బాంబు పేలుళ్లతో ఆకాశం మెరిసిపోయేలా నారింజ రంగు కాంతులు, దట్టమైన పొగలు, చెవులు దద్దరిల్లేలా శబ్దాలు వెలువడ్డాయి. కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకూ 7 వేలకుపైగా పాలస్తీనియన్లు చనిపోయారు. ఇజ్రాయెల్​పై ఎయిర్ అటాక్స్​లో కీలక పాత్ర పోషించిన హమాస్ కమాండర్ అసీం అబూ రకాబాను కూడా ఓ బాంబుదాడిలో హతమార్చినట్లు ఐడీఎఫ్ శనివారం వెల్లడించింది.   

పైన దవాఖాన.. కింద హమాస్ హెడ్ క్వార్టర్స్

హమాస్ మిలిటెంట్లు ప్రజలను హ్యూమన్ షీల్డులుగా వాడుకుంటూ టెర్రరిజానికి పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రుల కింద స్థావరాలను ఏర్పాటు చేసుకుని దాడులు చేస్తోందని వెల్లడించింది. గాజా సిటీలోని అతిపెద్ద దవాఖాన అయిన అల్ షిఫా హాస్పిటల్ కింద అండర్ గ్రౌండ్ లోనే హమాస్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నదంటూ సంబంధిత శాటిలైట్ ఫొటోలు, యానిమేషన్ వీడియోను ఐడీఎఫ్ శనివారం విడుదల చేసింది. అయితే, ఇజ్రాయెల్ ఆరోపణల్లో నిజం లేదని హమాస్ ఖండించింది. మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిలో ఫుడ్, వాటర్, మెడిసిన్స్, కరెంట్ లేక దవాఖాన మూతపడే పరిస్థితికి చేరిందని ఆ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. నవజాత శిశువులకు అతికష్టం మీద ట్రీట్మెంట్ చేస్తున్నామని, ప్రస్తుతం వేలాది మంది గర్భిణులు ప్రసవాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

హమాస్ పేరు లేకుండా తీర్మానమా?

యునైటెడ్ నేషన్స్: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంపై ఐక్యరాజ్య సమితిలో జోర్డాన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్​కు ఇండియా గైర్హాజరు అయింది. వెంటనే మానవతా ఒప్పందం కుదిరేలా చూడాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై యూఎన్ జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఓటింగ్ జరిగింది. అంతకు ముందు చర్చ సందర్భంగా ఇండియా డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యోజనా పటేల్ మాట్లాడుతూ.. తీర్మానంలో హమాస్ టెర్రరిస్ట్ దాడులను ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు.