నేతన్నలపైనే నేతల తలరాత.. సిరిసిల్లలో హోరాహోరీ

నేతన్నలపైనే నేతల తలరాత.. సిరిసిల్లలో హోరాహోరీ
  • గెలుపోటములను డిసైడ్​చేయనున్న పద్మశాలీ ఓటర్లు
  • చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమాలో మంత్రి కేటీఆర్​
  • ఎలాగైనా గెలవాలని కేకే మహేందర్​రెడ్డి ప్రయత్నాలు
  • అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాణిరుద్రమ

రాజన్నసిరిసిల్ల, వెలుగు :  సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్​నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐదోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణిరుద్రమరెడ్డి బరిలో నిలిచారు. వీరితోపాటు పద్మశాలి వర్గానికి చెందిన మరో ఇద్దరు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నారు. ఎవరికివారు హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేటీఆర్​తరఫున ఆయన అనుచరులు, పార్టీ లీడర్లు ఓట్లు అడుగుతున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కేటీఆర్​కు ఈ ఎన్నికలు అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్​ క్యాండేట్లతోపాటు ఇండిపెండెంట్ల నుంచి గట్టి పోటీ ఉంది. సిరిసిల్లలో అతిపెద్ద సామాజిక వర్గమైన పద్మశాలీల నుంచి ఫస్ట్​టైమ్​ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు.  నాలుగుసార్లు కేటీఆర్​ అలవోకగా గెలవడానికి పద్మశాలీలే కారణం. ఈసారి వారిలో నుంచే ఇద్దరు పోటీ చేస్తుండడం ఆసక్తి రేపుతోంది. ‘మన ఓట్లు మనకే’ అనే నినాదంతో వారిద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో పద్మశాలీల ఓట్లు భారీగా చీలుతాయనే చర్చ నడుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కేటీఆర్ కు పద్మశాలీల నుంచి ఓట్లు తగ్గుతాయని చెప్పుకుంటున్నారు.

అభివృద్ధే కేటీఆర్​ప్రచార మంత్రం

చేసిన అభివృద్ధే తనని గెలిపిస్తుందని కేటీఆర్ ధీమాగా ఉన్నారు. ప్రచారంలో భాగంగా తాను సిరిసిల్లలో చేసిన అభివృద్ధి పనుల గురించి పదేపదే చెబుతున్నారు. మందు పోయను.. పైసలు పంచను.. చేసిన మంచిని చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రధానంగా సిరిసిల్లకు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చానని, వర్కర్ టూ ఓనర్ పథకం, అపెరల్ పార్క్, వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్​ యూనివర్సిటీ తీసుకొచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. మల్కపేట రిజర్వాయర్, ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు నింపేందుకు 9వ ప్యాకేజీ పనులు, గంభీరావుపేట నర్మాలలో ఫుడ్​ ప్రాసెసింగ్ యూనిట్, ఆక్వా హబ్, మిడ్ మానేరు లాంటి ప్రాజెక్ట్ ల నిర్మాణం, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన 8 పార్కులు, కొత్త చెరువు సుందరీకరణ, హరిదాస్ నగర్ లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్ పనులను వివరిస్తున్నారు. బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుందని చెప్పి, తన ప్రచార బాధ్యతలను అనుచరులకు, మండల స్థాయి నాయకులకు అప్పగించారు.  2009 నుంచి వరుసగా 4 సార్లు గెలవడం, ప్రభుత్వ వ్యతిరేకత, అనుచరుల ఇసుక, ల్యాండ్​ దందా, కేటీఆర్​కు ప్రతికూల అంశాలు.

ప్రభుత్వ వ్యతిరేకతపై బీజేపీ, కాంగ్రెస్​ ఫోకస్​

బీఆర్ఎస్​, బీజేపీ క్యాండిడేట్లు కేటీఆర్​, రాణీ రుద్రమ నాన్​లోకల్స్​ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి స్థానికుడు. ఆయనది సిరిసిల్ల పరిధిలోని మస్తాబాద్ మండలం నామాపూర్. గతంలో బీఆర్ఎస్​లో పనిచేసిన ఆయన కేసీఆర్​కు సన్నిహితుడుగా మెదిలారు. కానీ 2009లో కేకేను కాదని కేటీఆర్ కు బీఆర్ఎస్ ​టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి బయటొక్చారు.  అదే ఎన్నికల్లో ఇండిపెండెంట్​గా పోటీ చేసి కేవలం 171 ఓట్ల తేడాతో కేటీఆర్​చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వరుసగా కేటీఆర్​పై పోటీ చేస్తూ వస్తున్నారు. ఈసారి తనకు సింపతీ కలిసొస్తుందని, సిరిసిల్ల ప్రజలు ఆశీర్వాదిస్తారని ఆశతో ఉన్నారు. 14 ఏండ్లుగా కేటీఆర్​స్థానికంగా ఒక్కరోజు ఉండలేదని, స్థానికుడైన తనను గెలిపిస్తే అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు.   కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీములను ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తనకు కలిసొస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమ పాదయాత్రతో సిరిసిల్లలో ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బీసీ సీఎం నినాదాలతో ప్రచారం చేస్తున్నారు. నాన్​లోకల్ కావడం ఆమెకు మైనస్ గా కనిపిస్తోంది.

ఇండిపెండెంట్లు ఎవరి ఓట్లు చీల్చుతారో?

పద్మశాలీలు ఈసారి సిరిసిల్లలో గెలుపోటములను డిసైడ్​చేయనున్నారు. ఇక్కడ వారి ఓట్లే 92 వేలు ఉన్నాయి. అదే వర్గానికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల టికెట్ ఆశించి భంగపడ్డారు. రాణీరుద్రమను ప్రకటించిన వెంటనే పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పద్మశాలీల ఓట్లన్నీ తనకే పడతాయని ఆశాభావంతో శ్రీనివాస్​ఉన్నారు. సిరిసిల్ల టౌన్​తోపాటు తంగళ్లపల్లి మండంలో ఆయనకు మంచి పట్టుంది. మరో యువనేత, పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన పత్తిపాక సురేశ్​పోటీలో ఉన్నారు. ఇప్పటికే హిందూ సాంస్కృతిక సమితి పేరిట పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్ల పద్మశాలీల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. వీరిద్దరి నుంచి కేటీఆర్​కు గట్టి పోటీ ఉంది.