బట్టలు మూలన.. బతుకులు రోడ్డున!

బట్టలు మూలన.. బతుకులు రోడ్డున!
  •     రాష్ట్రవ్యాప్తంగా  పేరుకుపోయిన నిల్వలు
  •     సేల్స్ పడిపోవడంతో కొత్త వస్త్రాల తయారీ బంద్
  •     చేనేత స్టాకు నిల్వలపై కేంద్రానికి రిపోర్ట్
  •     ప్రజా ప్రతినిధులకు పట్టని నేతన్నల కష్టాలు

నల్గొండ/యాదాద్రి, వెలుగుచేనేత కార్మికులను కరోనా చావుదెబ్బ తీసింది.  ఆరు నెలలుగా మగ్గం చప్పుళ్లు దాదాపు ఆగిపోగా, అడపాదడపా తయారు చేసిన వస్త్రాలను కొనేటోళ్లు లేక  గుట్టలుగా పేరుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారమే నల్గొండ, యాదాద్రి, వరంగల్, సిద్దిపేట, గద్వాల జిల్లాల్లో రూ.100 కోట్లకుపైగా స్టాక్.. కార్మికుల వద్ద, చేనేత సహకార సంఘాల్లో మూలుగుతోంది. కోవిడ్​తో నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్ని జిల్లాల్లో కార్మికులు రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది.

ఆగమవుతున్న వేలాది కార్మికులు

చేనేత వస్త్రాల తయారీ నిలిచిపోవడంతో మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాల వద్ద కోట్లు ఖరీదు చేసే వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. నల్గొండ జిల్లాలోనే సుమారు రూ.12 కోట్ల నిల్వలు ఉన్నాయని జిల్లా చేనేత జౌళి శాఖ అంచనా వేసింది. కోవిడ్ ఎఫెక్ట్​తో నిలిచిపోయిన ఈ వస్త్ర నిల్వల గురించి కేంద్రానికి రిపోర్ట్ పంపారు.  జిల్లాలో పోచంపల్లి వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మునుగోడు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 80 మంది మాస్టర్ వీవర్స్, వీళ్లపై ఆధారపడ్డ వెయ్యి మంది కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. యాదాద్రి జిల్లాలోని భూదాన్​పోచంపల్లిలో దాదాపు రూ. 70 కోట్ల చీరలు పేరుకుపోయాయి. ఏటా పెండ్లిళ్ల సీజన్​ కోసం జనవరిలోనే చీరల తయారీ మొదలుపెడతారు. మార్చి నుంచి లాక్​డౌన్​ కొనసాగడంతో పెండ్లిళ్లు జరగక కొనేవారులేక స్టాక్​గుట్టలుగా పేరుకుంది. సుమారు ఆరువేల మంది కార్మికులు ఆగమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే స్టాక్ మిగిలిపోయింది.  3.16 లక్షల జంబుఖనాలు, 20 వేల బెడ్ షీట్లు స్టోర్ రూమ్ లోనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని ఆరు చేనేత సంఘాల్లో దాదాపు రూ. 30 లక్షల విలువైన  చేతి రుమాళ్లు, తువ్వాళ్లు, గొల్లభామ చీరెల నిల్వలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 20 సహకార సంఘాల్లో  దాదాపు రూ.12 కోట్ల విలువైన చీరలు స్టాక్ మిగిలిపోయాయి. జిల్లాలో 4,350 మగ్గాలమీద పనిచేసే ఎనిమిది వేలమంది చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

చుట్టుముట్టిన సమస్యలు

క్లాత్​తయారీకి వినియోగించే నూలు ధరలు  విపరీతంగా పెరిగాయని వీవర్స్ చెప్తున్నారు. కరోనా రాకముందునుంచే ఈ రేట్లు పెరిగాయి. జనవరి, ఫిబ్రవరిలోనే రా మెటీరియల్ ధరలు రూ.2,500 నుంచి రూ. 4,500కు చేరాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే మెటీరియల్ కాస్ట్ డబుల్ కావడంతోపాటు, తయారు చేసిన వస్త్రాలను కొనేదిక్కు లేకుండా పోయింది. దీంతో ఏప్రిల్, మే నుంచే నేత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు. నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసు కోలేదని వీవర్స్ చెబుతున్నారు. చేనేతను ఆదుకోవాల్సిన ‘టెస్కో’ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండటంతో వస్త్రాల కొనుగోళ్లు ఆగిపోయాయి. మరోవై పు ఇప్పటికే చేనేత వస్త్రాలను కొనుగోలు చేసిన పెద్ద పెద్ద వ్యాపారులు సైతం బాకీలు  చెల్లించడం  ఆపేశారు.

సర్కారే కొనాలి

కోట్ల రూపాయల విలువైన చీరలు  పేరుకుపోయాయి. కొత్తగా చీరలు నేయడం లేదు. దీంతో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నది. పేరుకుపోయిన నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. స్టాక్​ కొంటేనే కార్మికులకు తిరిగి ఉపాధి దొరుకుతుంది.

‑ తడ్క రమేశ్, పోచంపల్లి చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్

మిత్తి కట్టలేకపోతున్నం

నేసిన చీరలన్నీ లాక్ డౌన్ వల్ల ఆరు నెలల నుంచి అమ్ముడుపోక పేరుకుపోయాయి. బయటి నుంచి రూ. 25 లక్షలు అప్పు తెచ్చి నేసిన 1,800 చీరలు అట్లనే ఉన్నయి. తెచ్చిన అప్పుకు మిత్తి కట్టలేకపోతున్నాం. గతంలో నెలకు లక్ష రూపాయల సరుకు అమ్మితే ఇప్పుడు పది వేల సరుకు కూడా అమ్మడయితలేదు. ప్రభుత్వమే చీరలు కొని ఆదుకోవాలి.

‑ చేర్యాల బుచ్చయ్య, మాస్టర్ వీవర్‌‌‌‌‌‌‌‌,  సిద్దిపేట చేనేత సహకార సంఘం  సభ్యుడు

బతుకమ్మ చీరలే మా కడుపు కొట్టాయి

బతుకమ్మ చీరల వల్లే కార్మికులు నష్టపోతు న్నారు. చేనేత శాఖ నుంచి ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం రూ. 220 కోట్లు మళ్లించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క  చీర కూడా కొనలేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద  చీరలు ఇస్తే అటు లబ్ధిదారులకు, చేనేత కార్మికులను మేలు జరుగుతుంది. లాక్​డౌన్ కాలానికి ఒక్కో కుటుంబానికి రూ. 7 వేల చొప్పున ఇవ్వాలని మంత్రి కేటీఆర్​ను ఇదివరకు కోరినా ఆయన నుంచి స్పందన లేదు.

‑ రామలింగేశ్వర కాంబ్లే, గద్వాల జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు

60 రోజులుగా దీక్షలు చేస్తున్నాం

కరోనా వల్ల చేనేత రంగం అస్తవ్యస్తమైంది. లాక్​డౌన్ కంటే ముందు నుంచే కష్టాలు ఎదురయ్యాయి. చైనా నుంచి మెటీరియల్ ఆగిపోయింది. రా మెటీరియల్ ధరలు పెరిగాయి. మావరకు ఏదోరకంగా వెళ్లదీస్తున్నాం. కానీ కార్మికులు రోడ్డున పడ్డారు. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి మా సమస్యను విన్నవించాం. కానీ ఎలాంటి స్పందన రాలేదు. పోచంపల్లి వద్ద దీక్ష చేస్తామంటే వద్దని చెప్పారు. దీంతో జులై 12 నుంచి చండూరులో రిలే దీక్షలు చేస్తున్నాం.

‑ జూలూరి ఆంజనేయులు, మాస్టర్ వీవర్, రిలే దీక్షల జేఏసీ కన్వీనర్, చండూరు