మా భూమి మాకిప్పించండి.. లేదంటే కారుణ్య మరణానికి..

మా భూమి మాకిప్పించండి.. లేదంటే కారుణ్య మరణానికి..
  • కలెక్టరేట్ ఎదుట దంపతుల నిరసన

నల్గొండ: రెవెన్యూ అధికారులు అక్రమంగా తమ భూమిని దొంగ పత్రాలతో వేరే వ్యక్తికి సాదాబైనామా రిజిస్టర్ చేశారని.. సదరు రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కన్నెకల్ గ్రామానికి చెందిన  కొండూరు రామలింగం దంపతులు నిరసనకు దిగారు. మా భూమిమాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతివ్వమంటూ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గ్రామ శివారు లోని  తమకు వారసత్వంగా వచ్చిన ,148 149 సర్వే నెంబర్ గల మూడు ఎకరాల 24 గంటల వ్యవసాయ భూమిని దాచారం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి యారమాదా చిన్నరామ్ రెడ్డి దొంగ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి సాదాబైనామా కింద తమ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడని ఆరోపించారు. ఈ భూమి విషయం పై మిర్యాలగూడ ఆర్డీవోకు, ఎమ్మార్వో దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, రెవెన్యూ అధికారులు రామ్ రెడ్డి కి సహకరిస్తూ తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లినా.. ఆర్డీవో ఈ భూమి అక్రమంగా రిజిస్టర్ అయింది అని కలెక్టర్ గారికి చెప్పినప్పటికీ తమకు న్యాయం  చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాదాబైనామా రిజిస్ట్రేషన్ తీసివేసి  తమ భూమిని తమకు అప్పగించాలని బాధిత దంపతులు ప్రభుత్వాన్ని కోరారు.