కొత్తపల్లి మున్సిపల్​ కమిషనర్​ చాంబర్ ​ఎదుట చచ్చిన కోడిని వేలాడదీసిండు!

కొత్తపల్లి మున్సిపల్​ కమిషనర్​ చాంబర్ ​ఎదుట చచ్చిన కోడిని వేలాడదీసిండు!
  •      కరీంనగర్​ జిల్లాలో ఓ ఆర్ఎంపీ వినూత్న నిరసన
  •     కుక్కల బెడద నివారించాలని వినతి 

కొత్తపల్లి, వెలుగు :  కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ ప్రజలను కుక్కల బారి నుంచి కాపాడాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. కొత్తపల్లికి చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ అజీజొద్దీన్ సోమవారం చనిపోయిన కోడిని తీసుకెళ్లి కమిషనర్ చాంబర్​ దర్వాజకు వేలాడదీశాడు. మంగళవారం ఉదయం సిబ్బంది వచ్చి కోడిని తొలగించారు.

అజీజొద్దీన్​ మాట్లాడుతూ కొత్తపల్లి మున్సిపాలిటీలో ఐదు వేల జనాభాకు ఐదు వందల వీధికుక్కలున్నాయని, బండ్ల వెంట పడడం, రోడ్ల వెంట వచ్చేవారిని, చిన్న పిల్లలను, జంతువులను కరుస్తుండడంతో ప్రశాంతంగా తిరగలేకపోతున్నామన్నారు. మూడేండ్ల కింద మేకను చంపినప్పటి నుంచి కంప్లయింట్స్​​ఇస్తూ వస్తున్నానని, కానీ, మున్సిపల్​అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గతంలో ఓ పిచ్చికుక్క పలువురిపై దాడి చేయగా స్థానికులు చంపడంతో కేసులు నమోదు చేశారని, దీంతో నిబంధనల మేరకే కుక్కల బారి నుంచి కాపాడాలని అభ్యర్థిస్తున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు.

ఏడాదిన్నర కింద ఓ చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయని, అప్పటి నుంచి తల్లిదండ్రులను పిల్లలను బయటకు పంపడం లేదన్నారు. మున్సిపల్​లో కుక్కలను పట్టుకోవడానికి తీర్మానం చేసినా కొన్ని కారణాలతో విరమించుకున్నారన్నారు. మున్సిపల్ ఆఫీసులోనే 20 వరకు కుక్కలున్నాయన్నారు. సోమవారం ఓ కోడిని చంపేశాయని, దాన్ని తీసుకుని కమీషనర్​కు చూపిస్తే పెద్దగా స్పందించలేదన్నారు. అందుకే నిరసనగా ఆయన ఛాంబర్​దర్వాజకు కట్టి వచ్చానని చెప్పారు. 

పశు వైద్యాధికారులు స్పందించట్లేదు 

ఈ విషయమై మున్సిపల్​కమిషనర్​ కె.వేణుమాధవ్​ను వివరణ కోరగా మున్సిపాలిటీలో కుక్కల బెడద ఉన్న మాట వాస్తవమేనని, వాటి నియంత్రణ కోసం స్టెరిలైజేషన్​ చేయాలని ఆరు నెలలుగా జిల్లా పశువైద్యాధికారితో మాట్లాడుతున్నామన్నారు.  స్పెషల్​ క్యాంప్​పెట్టి బెడద తగ్గిస్తామని చెప్పినా ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు.