బతుకుదెరువుకు వచ్చి.. బలైపోతున్నరు.. ఎల్కతుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల ఘోష

బతుకుదెరువుకు వచ్చి.. బలైపోతున్నరు.. ఎల్కతుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీల్లో కార్మికుల ఘోష
  • ఆత్మహత్యలు, అనుమానాస్పద స్థితిలో ఇప్పటికే 10 మందికి పైగా మృతి
  • గత నెల రోజుల్లోనే తనువు చాలించిన ఇద్దరు కార్మికులు
  • గుట్టుచప్పుడు కాకుండా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్న యజమానులు
  • అన్నీ తెలిసినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు

హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు :  హనుమకొండ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చే ఇతర రాష్ట్రాల కార్మికులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. భారీ యంత్రాలు, కనీస రక్షణ లేని ప్రదేశాల్లో పనిచేసే టైంలో ప్రమాదాల బారిన పడి కొందరు చనిపోతుండగా, అనుమానాస్పద స్థితిలో మరికొందరు మృత్యువాత పడుతున్నారు.

 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రానైట్ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో గ్రానైట్ ఇండస్ట్రీ  యజమానులు గుట్టుచప్పుడు కాకుండా డెడ్ బాడీలను సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని ప్రదేశాల్లో కార్మికుల భద్రతను పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


49 ఇండస్ట్రీలు.. 800కుపైగా కార్మికులు 

హనుమకొండ జిల్లాలో మొత్తం 100 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఉండగా.. ఒక్క ఎల్కతుర్తి పరిధిలోనే 49 వరకు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి గ్రానైట్ స్లాబ్స్ తీసుకొస్తున్న యజమానులు వాటి కట్టింగ్, పాలీషింగ్, ఎక్స్ పోర్ట్ తదితర అవసరాల కోసం ఉత్తర ప్రదేశ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, అసోం తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులను పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా ఒక్క ఎల్కతుర్తి పరిధిలోని వివిధ కంపెనీల్లో 800 మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. కాగా గ్రానైట్ ఇండస్ట్రీల ఓనర్లకు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కంపెనీలు ఉండడంతో అక్కడి అవసరాన్ని బట్టి కార్మికులను సర్దుబాటు చేసుకుంటున్నారు. కార్మికుల వివరాలను పక్కాగా మెయింటెయిన్ చేయాల్సిన నిర్వాహకులు అదేమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో ఏ కార్మికుడు ఏ కంపెనీ లో పని చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. 


ఇటీవల జరిగిన ఘటనలు

  • ఎల్కతుర్తిలోని గ్రానైట్ ఇండస్ట్రీల్లో కొంతకాలంగా జరుగుతున్న కార్మికుల మరణాలు కలకలం రేపుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోని ఇద్దరు కార్మికులు చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
  • జులై 14న ఎల్కతుర్తిలోని ఎస్ఆర్ కే గ్రానైట్ ఇండస్ట్రీలో అసోంకు చెందిన దీపక్ ఘోర్ (22) అనే కార్మికుడు మిస్ అయ్యాడు. వాస్తవానికి కార్మికుడు అదృశ్యమైన రోజే సంబంధిత యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినప్పటికీ అదేమీ పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత దీపక్ ఘోర్ డెడ్ బాడీ అదే ఫ్యాక్టరీ సంపులో తేలింది. కంపెనీలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కార్మికుడు మిస్ అయిన సమయంలో అవి పని చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం 
  • అవుతున్నాయి. 
  • ఈ నెల 17న సూరారం శివారులోని సాయి శ్రీలక్ష్మి గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తరప్రదేశ్ కు చెందిన హరిశంకర్ (19) లేబర్ రూమ్‌‌లో చనిపోయి కనిపించాడు. ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. హరిశంకర్ మృతిపై అనుమానాలున్నాయని, డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. 
  • 2024 మార్చి 18న బిహార్ కు చెందిన దీపక్ కుమార్, అఖిల్ ఎల్కతుర్తి శివారులోని కెనాల్ లో పడి ప్రాణాలు కోల్పోయారు. 
  • యశోద, దుర్గ ఇండస్ట్రీలో పని చేసే దేవేంద్ర కుమార్ అనే కార్మికుడు గ్రానైట్ సా  మిషన్ మీద పడడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. 
  •  రాజస్థాన్ నాగూర్ జిల్లా బిలాల్ తాలూకాకు చెందిన రాజేంద్ర కుమార్ జౌకర్ అలియాస్ రాహుల్ జైబాలాజీ ఇండస్ట్రీలో సూసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.  

పట్టించుకోని ఓనర్లు, ఆఫీసర్లు

గ్రానైట్ ఇండస్ట్రీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల్లో ఇప్పటివరకు 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా ఇక్కడి ఇండస్ట్రీల యజమానులు కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

వాస్తవానికి ప్రమాదాలు, ఇతర కారణాల వల్ల కార్మికుడు చనిపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం, కేసు నమోదు చేయడం, పోస్టుమార్టం చేయించడం, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం చట్టపరమైన ప్రక్రియలో భాగం. కానీ కొంతమంది గ్రానైట్ ఇండస్ట్రీల యజమానులు నామమాత్రపు చర్యలతో హడావుడిగా డెడ్ బాడీలను సొంత రాష్ట్రాలకు పంపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇదిలాఉంటే గ్రానైట్ ఇండస్ట్రీల కార్మికుల భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా అటువైపు తొంగిచూడడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్మికులతో 12 గంటలకుపైగా పని చేయించడంతో పాటు వేతనాల విషయాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ఎల్కతుర్తి గ్రానైట్ ఇండస్ట్రీల్లో కార్మికుల చావులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు కార్మికుల బతుకులకు భద్రత కల్పించేలా చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.