ఎల్కతుర్తి, వెలుగు : సర్పంచ్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న యువకుడు అస్వస్థతకు గురై చనిపోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...
గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య కుమారుడు ప్రణీష్ (30) గురువారం రాత్రి ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొని డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.
రాత్రి టైంలో గుండెపోటు రావడంతో 108లో హుజూరాబాద్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రణీశ్ కుటుంబ సభ్యులను సర్పంచ్ పుల్లూరి శ్రీధర్‌రావు పరామర్శించారు.

