హనుమకొండ, వెలుగు: వరంగల్ ఆర్వో పరిధిలో హనుమకొండ సబ్ రిజిస్ట్రార్–2 దావులూరి ఆనంద్ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఏప్రిల్ 2న ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్–2 దావులూరి ఆనంద్, సబ్ రిజిస్ట్రార్–1 జమలాపురం నరసింహరావు పట్టుబడగా, అదే నెల 20న ఇద్దరినీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
అనంతరం ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఆకస్మిక తనిఖీల అనంతరం ఇప్పటికే రెండుసార్లు ఆనంద్ నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు, బుధవారం మరోసారి ఆనంద్‌తో పాటు ఆయన బంధువుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు.
తన సర్వీస్ కాలంలో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఆదాయానికి మించిన ఆస్తులు పోగేసినట్లు అధికారులు నిర్ధారించారు. విచారణలో రూ.71,56,708 విలువైన రెండు నివాస గృహాలు, రూ.28.37 లక్షల విలువైన ఆరు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.
బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం వీటి ధర కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవే కాకుండా రూ.24,50,450 నగదు, రూ.7,05,367 బ్యాంకు బ్యాలెన్స్, రూ.6.07 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.13.25 లక్షల విలువైన కారు, రెండు బైకులు, 819 గ్రాముల బంగారం, 2.26 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు.
మొత్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.1,94,01,765 విలువైన ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. ఆనంద్ అక్రమాస్తులపై విచారణ కొనసాగుతోందని డీఎస్పీ సాంబయ్య వివరించారు.
