కేసీఆర్ మళ్లీ వస్తే ఆర్టీసీ ఆస్తులు గాయబ్: జీఎస్ హన్మంతు

కేసీఆర్ మళ్లీ వస్తే ఆర్టీసీ ఆస్తులు గాయబ్: జీఎస్ హన్మంతు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఆస్తులు గాయబ్ చేస్తరని ఆర్టీసీ టీజేఎంయూ  జనరల్ సెక్రటరీ హన్మంతు అన్నారు.  ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమని ప్రకటించారని, ప్రక్రియ మాత్రం పూర్తి చేయలేదని ఆరోపించారు. రాష్ర్టంలో పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులందరూ ఈసారి కాంగ్రెస్ కు ఓటు వేయాలని సోమవారం ఒక  ప్రకటనలో  కోరారు. కార్మికులు, ఉద్యోగులు 45 వేల మంది ఉండగా.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు లక్షల్లో ఉన్నారని హన్మంతు తెలిపారు.

10 ఏండ్ల నుంచి ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ నమ్మించి మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు రెండు పీఆర్సీలు రావాల్సి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికుల జీతాలకు చాలా వ్యత్యాసం ఉందని గుర్తుచేశారు. మునుగోడు బైపోల్ టైమ్ లో పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు.  పీఆర్సీ ఇస్తామంటే ఉప ఎన్నికలో 8 వేల మంది బీఆర్ఎస్ కు ఓట్లు వేశారని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 2017,2021 పీఆర్సీలు, 2012 పీఆర్సీ 50 శాతం బకాయిలు ఉన్నాయన్నారు.