- హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్
హనుమకొండ, వెలుగు: జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణకు పారదర్శకంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్మన్, కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జేఈఈ మెయిన్స్-2026, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించనున్న జాతీయ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సోమవారం రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ జనవరి 21 నుంచి 30 వరకు, రెండో సెషన్ ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరగనుందని, ఇందుకు జిల్లాలో 4 పరీక్షా కేంద్రాల ఆడిట్ నిర్వహణకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదికను సమర్పించాలన్నారు.
కమిటీ సభ్యులు డీసీపీ రవి, ఏసీపీ నర్సింహారావు, ఎన్టీఏ నామినేట్ చేసిన జిల్లా నోడల్ ఆఫీసర్, జవహర్ నవోదయ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ కె.శ్రీమతి, డీఈవో ఎల్.వి.గిరిరాజ్ గౌడ్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ ఏవో గౌరీశంకర్ సమన్వయంతో పరీక్షా కేంద్రాలను సందర్శించి సమగ్ర, భౌతిక ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆడిట్ పూర్తయిన అనంతరం ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
