ఘనంగా హనుమాన్ జయంతి.. కొండగట్టులో భక్తుల రద్దీ

ఘనంగా హనుమాన్ జయంతి.. కొండగట్టులో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: హనుమాన్​ పెద్దజయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గురువారం (May 22) భక్తులతో కిక్కిరిసిపోయింది. జయంతి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు హనుమాన్  జయంతి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

హనుమాన్  దీక్షాపరులతో గుట్ట మొత్తం కాషాయమయంగా మారింది. మూడు రోజుల్లో 3 లక్షల మంది భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్  అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ హనుమాన్  భక్తుల రాక మాత్రం ఆగలేదు.

పాదయాత్రగా గుట్టకు చేరుకొని ఇరుముడులతో స్వామివారిని దర్శించుకుని మాల విరమణ చేశారు. గురువారం రాత్రి 10 గంటల తరువాత భారీ సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకోవడంతో మాల విరమణ వద్ద ఉన్న ఐదు కంపార్ట్​మెంట్లు  నిండిపోయాయి. ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. పెద్ద జయంతి సందర్భంగా అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అభిషేకం అనంతరం ఉయ్యాల సేవ నిర్వహించి ఉత్సవ మూర్తులను పల్లకీలలో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రధానాలయంలో ప్రతిష్టించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి తిరుమంజనం,  ద్రావిడ ప్రబంధ పారాయణం, సహస్ర నాగవల్లి అర్చన చేశారు. సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమార్చన, ప్రధాన ఆలయంలో సహస్రదీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహించారు. కంకణోధ్వాసన, మహాపుష్పం, మహాదాశీర్వాదం, రాత్రి సామూహిక భజన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిసినట్లు అధికారులు తెలిపారు.

వేములవాడకు పోటెత్తిన భక్తులు..

వేములవాడ: హనుమాన్  జయంతి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం హనుమాన్  దీక్షాపరులు కొండగట్టుకు బయల్దేరివెళ్లారు. గురువారం 50 వేల  మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.