మోస్ట్ వాంటెడ్ యాక్టర్

మోస్ట్ వాంటెడ్ యాక్టర్

కొందరు అందంగా నటిస్తారు. కొందరు నటనకి కొత్త నిర్వచనం ఇస్తారు. మరికొందరు అసలు నటనంటే అదే అన్నంతగా మెప్పిస్తారు. ఈ మూడు దశలనూ దాటి సూపర్‌‌ స్టార్ అయ్యారు మమ్ముట్టి. బేసిగ్ గా  మమ్ముట్టి మలయాళ నటుడే అయినప్పటికి ఇతర భాషల్లోనూ ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఎంతోమందికి ఫేవరేట్ యాక్టర్. ఇవాళ మమ్ముట్టి  పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు. 

మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. మమ్ముట్టి అనేది స్క్రీన్‌ నేమ్. 1951లో కేరళలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెద్ద కొడుకుగా జన్మించారు. తండ్రి బట్టల షాపు నడిపేవారు. బియ్యం వ్యాపారమూ చేసేవారు. తల్లి గృహిణి. ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు. కొట్టాయంలోని గవర్నమెంట్ హైస్కూల్లో చదువుకున్నారు. ఎర్నాకులం లోని గవర్నమెంట్ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. రెండేళ్ల పాటు లాయర్‌‌గా ప్రాక్టీస్ కూడా చేశారు. 

1971లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు మ్మముట్టి. చాలా సినిమాల్లో డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు. 1980లో ‘మేళా’ అనే సినిమా చేసేవరకు కూడా చాలా స్ట్రగులయ్యారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలూ పెరిగాయి. ‘తృష్ణ’ అనే సినిమాతో బ్రేక్ వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌‌గా స్టేట్ అవార్డు కూడా వరించింది. ‘యవనిక’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌తో ఆయన కెరీర్‌‌ పూర్తిగా మలుపు తిరిగింది. ఏ స్థాయికి వెళ్లిపోయారంటే.. ఎనభైల కాలంలో మూడేళ్లలో నూట ఇరవై సినిమాలు చేసేశారు. 

మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోనూ సినిమాలు చేశారు మమ్ముట్టి. తెలుగులో స్వాతికిరణం, సూర్యపుత్రులు, యాత్ర చిత్రాలు చేశారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తీస్తున్న ‘ఏజెంట్‌’లో నటిస్తున్నారు.  సోలో హీరోగా ఎదిగినా ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండటం మమ్ముట్టి స్టైల్. మలయాళంలో చాలామంది హీరోలతో కలిసి సినిమాలు చేశారాయన. ఎక్కువగా నటించింది మాత్రం మోహన్‌లాల్‌తో. వీరిద్దరూ కలిసి యాభైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో చాలావరకు హిట్ కావడం విశేషం. 

మలయాళంలో మొట్టమొదటిసారి డ్యూయెల్ రోల్ చేసింది మమ్ముట్టినే. ఎక్కువసార్లు ఇద్దరిగా కనిపించింది కూడా ఆయనే. పదికి పైగా సినిమాల్లో డ్యూయెల్ రోల్, ఒక మూవీలో ట్రిపుల్ రోల్ కూడా చేశారు. అత్యధికసార్లు డబుల్ రోల్ చేసినవారిలో ప్రేమ్ నజీర్ తర్వాతి స్థానంలో నిలబడ్డారు.  ఇప్పటి వరకు మూడు సార్లు నేషనల్ అవార్డ్ గెలుచుకుని రికార్డు సృష్టించారు మమ్ముట్టి. 1989లో మొదటి సారి జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 1993లో అందుకున్నారు. మూడోసారి ఇంగ్లిష్ సినిమా ‘డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌‌’కి గాను తీసుకున్నారు. అలాగే ఏడుసార్లు కేరళ స్టేట్ అవార్డ్, పదమూడుసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. మిగతా అవార్డులు ఎన్ని అందుకున్నారో లెక్కే లేదు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతోనూ ఆయన్ని సత్కరించింది. 

2000వ సంవత్సరంలో నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టారు మమ్ముట్టి. మెగాబైట్స్ అనే బ్యానర్‌‌ను స్థాపించి ముందుగా ఒక టీవీ సీరియల్ నిర్మించారు. ఆయనకి సొంతగా ఓ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. కైరాలీ టీవీ, కైరాలీ న్యూస్ లాంటి మలయాళ ఛానల్స్ని నడిపే మలయాళం కమ్యునికేషన్స్ని చైర్మన్‌గా కూడా మమ్ముట్టి వ్యవహరిస్తున్నారు 

మమ్ముట్టిలో మంచి రైటర్ ఉన్నారు. ఓ న్యూస్‌ పేపర్‌‌కి ప్రతి శుక్రవారం ఓ ఆర్టికల్ రాసేవారు. ఆ వ్యాసాలతో ఓ పుస్తకం కూడా వెలువడింది. తనను ఆలోచింపజేసిన, కదిలించిన విషయాలను అక్షరీకరించడం తనకి ఇష్టమని ఓ సందర్భంలో చెప్పారాయన. అలాగే ఫొటోగ్రఫీ కూడా చాలా ఇష్టం మమ్ముట్టికి. ఏమాత్రం చాన్స్ దొరికినా కెమెరా పట్టుకుంటారు. ఇక ఆయన ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. కేరళ వాలీబాల్ లీగ్‌కి అంబాసిడర్‌‌గా యంగ్‌ వాలీబాల్ ప్లేయర్స్ని ప్రమోట్ చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. 

చాలా చారిటబుల్ ప్రాజెక్టులకి మమ్ముట్టి గుడ్‌విల్ అంబాసిడర్. స్ట్రీట్ చిల్డ్రన్‌ జీవితాలు బాగు చేయడానికి, క్యాన్సర్ పేషెంట్ల వైద్యం కోసం వర్క్ చేసే చాలా సంస్థలతో చేయి కలిపారాయన. భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పలుమార్లు సేవా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు.  యాభయ్యేళ్ల కెరీర్‌‌లో మూడొందల తొంభైకి పైగా సినిమాలు చేసిన ఘనత మమ్ముట్టిది. రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్టు.. చేసిన ఏవో కొన్ని తప్ప మిగతావన్నీ చెప్పుకోదగ్గ పాత్రలే. జూనియర్ ఆర్టిస్టుగా ఉన్నప్పటి నుంచి సూపర్ స్టార్ అయ్యేవరకు ఎప్పుడూ పాత్రలో జీవించారే తప్ప ఏ క్యారెక్టర్‌‌నీ  లైట్‌గా తీసుకోలేదని ఆయనతో పనిచేసిన దర్శకులు చెబుతుంటారు. అందుకే ఆయన అంత గొప్ప నటుడయ్యారు. అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు. ఆయన మరెన్నో యేళ్లు ఇలాగే స్టార్‌‌గా కొనసాగాలని.. తన అద్భుతమైన నటనతో అన్ని భాషల వారినీ అలరించాలని ఆశిస్తూ.. మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు.