దటీజ్ ఇళయ దళపతి విజయ్

దటీజ్ ఇళయ దళపతి విజయ్

విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్.. ఇలా చెబితే చాలామంది గుర్తు పట్టరు. ఇళయ దళపతి విజయ్..అంటే గుర్తు పట్టని వారుండరు. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై.. హీరోగా అందరికీ దగ్గరై.. స్టార్‌‌గా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న విజయ్ పుట్టినరోజు నేడు. 

మొదట్నుంచీ సినిమాలపై ఆసక్తి..
1974.. జూన్ 22న మద్రాస్‌లో విజయ్ జన్మించాడు. తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ తమిళ సినీ దర్శకుడు. తల్లి శోభ సింగర్. కర్ణాటక విద్వాంసురాలు. విజయ్ చిన్నతనమంతా మద్రాస్‌లోనే గడిచింది.  విజయ్ కుటుంబం  చాలా కష్టాలు పడింది.  విజయ్ చిన్నతనంలో వారి జీవితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. వాళ్లమ్మ కచేరీలకు వెళ్తే రోజుకి వంద రూపాయలు మాత్రం వచ్చేవి. అవి వచ్చిన రోజు కడుపు నిండా భోజనం ఉండేది. లేనిరోజు పస్తులే. అలాంటి పరిస్థితులను  దాటుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది విజయ్  కుటుంబం. విజయ్ పై తల్లిదండ్రుల ప్రభావం ఉండటంతో అతని మొదట్నుంచీ సినిమాలపై ఆసక్తి కనభర్చేవారు.  అందుకే తన తండ్రి తీసిన ‘వెట్రి’ అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాన్న తీసిన మరో ఐదు సినిమాల్లోనూ బాల నటుడిగా కనిపించాడు. వీటిలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘నాన్ శివప్పు మనిధన్’ ఒకటి. ఆ తర్వాత చదువు మీద దృష్టిపెట్టిన విజయ్...విజువల్ కమ్యునికేషన్స్ కోర్సులో పట్టా సంపాదించాలనుకున్నాడు. కానీ హీరో అవ్వాలనే ఆశతో బ్యాచ్‌లర్ డిగ్రీని మధ్యలోనే అపేసి..తెరపైకి వచ్చేశాడు. 

శ్రమతో స్టార్ డమ్..
18 ఏళ్ల వయసులో  విజయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  నాన్న చంద్రశేఖర్ తీసిన సినిమా నాలైయా తీర్పులో నటించాడు.  కీర్తన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, శ్రీవిద్య, శరత్‌బాబు లాంటి ఫేమస్ ఆర్టిస్టులంతా  యాక్ట్ చేశారు. మొదటి మూవీకే  విజయ్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు తీసుకున్నాడు. తండ్రి దర్శకుడైనా..విజయ్ మాత్రం.. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యే ఈ మూవీలో నటించడం గమనార్హం. ఆడిషన్ లో హీరో రజినీకాంత్ నటించిన ‘అన్నామలై’ మూవీలోని ఓ డైలాగ్‌ చెప్పాడు విజయ్. అదే తనకి మొదటిసారి హీరో అవకాశాన్ని కల్పించిందని, రజినీకాంత్ అనే ఆయనే లేకపోతే ఈరోజు తాను లేనని విజయ్ చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఎంట్రీ ఈజీగానే ఇచ్చినా.. పేరు, స్టార్‌‌డమ్ మాత్రం కష్టపడే సంపాదించుకున్నాడు. ‘రసిగన్’ సినిమాతో అతని హవా పెరిగిపోయింది. నాటి నుంచి నేటి వరకు గిల్లీ, పోకిరి, బద్రి, కురువి, తుపాకీ, తలైవా, జిల్లా, కత్తి, తేరి, భైరవ, మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్ అంటూ సూపర్ డూపర్ హిట్లు కొడుతూనే ఉన్నాడు.

దటీజ్‌ విజయ్
అభిమానులంతా విజయ్‌ని దళపతి అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్లే  నిజంగానే ఆయన వెనుక ఓ పెద్ద దళమే ఉంది. అది ఆషామాషీగా వచ్చింది కాదు. అతని విజయాలు చూసి వచ్చినది. 2017లో తమిళనాట హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో  రెండో స్థానంలో ఉన్న విజయ్.. ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నాడు.  దాని వెనుక ఎంతో కృషి ఉంది. మొదట్లో రీమేక్ సినిమాల్లో ఎక్కువ నటించేవాడు.  కానీ రాను రాను అతనికి ఫాలోయింగ్ పెరిగింది. విజయ్  యాక్టింగ్‌ స్టైల్తో పాటు సబ్జెక్ట్ సెలెక్షన్ కూడా మారింది. డిఫరెంట్ కాన్సెప్టులు ఎంచుకుంటూ మాస్‌ హీరోగా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకి ఎదిగాడు. అభిమానుల విషయంలోనే కాదు, కలెక్షన్ల విషయంలోనూ రజినీకాంత్‌కి వారసుడు అంటున్నారంటే అతని స్థాయి ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్లలో పదిహేను సినిమాల వరకు చేశాడు విజయ్. వాటిలో చాలావరకు సినిమాలు వంద కోట్ల క్లబ్బులో చేరాయి. మెర్సల్, తేరి,  సర్కార్, మాస్టర్ లాంటి మూవీస్ అన్నీ వంద, నూట యాభై, రెండొందలు, మూడొందలు అంటూ కోట్లు కొల్లగొట్టాయి. రీసెంట్‌గా వచ్చిన ‘బీస్ట్’ మూవీ కూడా టాక్ పరంగా యావరేజ్‌ అనిపించుకుందేమో కానీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో రజినీ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో విజయేనని మరోసారి ప్రూవ్ చేసిందీ చిత్రం.

ఫాన్ ఫాలోయింగ్ మామలుగుండదు..
విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అప్పట్లో మన సినిమాల్ని విజయ్ కాపీ చేయడం చూసి నవ్వుకునేవారు కొందరు. అయితే ఆ తర్వాత అతని మాస్ ఇమేజ్‌కి మనవాళ్లు కూడా ఇంప్రెస్ అయిపోయారు. ముఖ్యంగా ‘విజిల్‌’ సినిమాతో తెలుగునాట విజయ్‌ మార్కెట్ విస్తరించింది. మాస్టర్, బీస్ట్ చిత్రాలకు ఇక్కడ కూడా చెప్పలేనంత హైప్ వచ్చింది. అందుకే ఇప్పుడు నేరుగా టాలీవుడ్‌లోనే అడుగుపెడుతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ‘వారసుడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్లో కూడా విజయ్ నటించాడు. అయితే అది క్యామియో మాత్రమే. అక్షయ్ కుమార్ నటించిన ‘విక్రమ్ రాథోడ్’లో ఒక అతిథి పాత్రలో మెరిశాడు విజయ్. అలాగే కేరళలోనూ అతనికి అభిమానులున్నారు.  అల్లు అర్జున్ తర్వాత విజయ్ కే  అక్కడ ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది. 

యాక్టరే కాదు..
విజయ్‌ సింగింగ్‌ అన్నా, డ్యాన్స్ అన్నా విపరీతంగా ఇష్టపడేవాళ్లు లక్షల్లో ఉన్నారు. డ్యాన్స్లో అతనికంటూ ఒక స్టైల్ ఉంది. సింపుల్‌గా, చలాకీగా వేసే చిన్న చిన్న స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఊగిపోతుంటారు.  తల్లి గాయని కావడం వల్ల చిన్నతనం నుంచే విజయ్‌కి కూడా పాడటం అలవాటైంది. ఆ టాలెంట్‌ అతనికి అడిషనల్ అట్రాక్షన్ అయ్యింది. మొదటిసారి ‘రసిగన్’ సినిమాలో విజయ్ తన గొంతు వినిపించాడు. ఇళయరాజా, దేవా, యువన్ శంకర్‌‌ రాజా, విద్యాసాగర్, శిర్పి, ఎస్‌.ఎ.రాజ్‌కుమార్, రమణ గోగుల, డి.ఇమ్మాన్, దేవిశ్రీ ప్రసాద్, హ్యారిస్ జైరాజ్, జీవీ ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్‌‌, రెహమాన్.. ఇలా చాలామంది సంగీత దర్శకులు అతనితో పాటలు పాడించారు. సింగర్‌‌గా అవార్డులు కూడా అందుకున్నాడు. 2016లో అతను పాడిన పాప్ సాంగ్ ‘సెల్ఫీ పుల్లా’ రొమానియాతో పాటు ఇతర యూరోపియన్ కంట్రీస్‌లో అత్యంత పాపులర్ అయిన పాటగా రికార్డు సృష్టించింది. రీసెంట్‌గా వచ్చిన ‘బీస్ట్’లోని జాలీ జింఖానా అనే పాట కూడా విజయ్ పాడిందే.

చెల్లెలి కోసం..
విజయ్‌కి విద్య అనే సిస్టర్ ఉండేది. కానీ ఆమె  రెండేళ్ల వయసులోనే చనిపోయింది. దాంతో చిన్నతనంలోనే చాలా డిప్రెస్ అయ్యాడు విజయ్. ఎప్పుడూ హుషారుగా ఉండేవాడు కాస్తా డల్ అయిపోయాడు. పెరిగి పెద్దై పెద్ద స్టార్ అయ్యాక కూడా అతన్ని ఆ బాధ వెంటాడుతూనే ఉంది. చెల్లెలి పేరుతో ఎన్నో దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అంతేకాదు.. ఆమె పేరును కలుపుకుని విద్య విజయ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌‌ను స్థాపించాడు. ఆమె ఫొటోని ‘శుక్రన్’ అనే సినిమాలో కూడా చూపించాడు. 

విజయ్ది ఓ స్పెషల్ స్టైల్
ఓసారి యూఎస్ వెళ్లినప్పుడు హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్‌ బీచ్‌ హౌస్ చూసి చాలా ముచ్చటపడ్డాడు విజయ్. దాని ఫొటో తీసి వెంట తెచ్చుకున్నాడు. తమిళనాడులో అచ్చం అలాంటి బీచ్ హౌస్నే కట్టించుకున్నాడు. ఇలాంటివి విన్నప్పుడు డబ్బుంది కాబట్టి చేశాడు అంటూ కామెంట్ చేశారు కొందరు. అయితే డబ్బున్నవాళ్లంతా చేయని గొప్ప పనులు చాలానే చేస్తాడు విజయ్. తరచూ ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంటాడు. ఓసారి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని న్యూబార్న్ బేబీస్ అందరికీ గోల్డ్ రింగ్స్ ప్రెజెంట్ చేశారు. చదువును మధ్యలోనే ఆపేస్తున్న చిన్నారులని మళ్లీ స్కూల్స్కి పంపించేందుకు ముందుకొచ్చాడు. యుద్ధాల సమయంలో, ధర్నాలప్పుడు, ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడూ అందరితో కలిసి నిరాహారదీక్షలు సైతం చేశాడని కొందరికే తెలుసు. తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదవాళ్లను ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు. మెరిట్ స్టూడెంట్స్కి అవార్డులిచ్చి ప్రోత్సహిస్తాడు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు అండగా నిలబడతాడు. 

ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్‌ గురించిన విశేషాలకు చోటు చాలదు. ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నాడు. డాక్టరేట్లూ పొందాడు. అతని కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడే అభిమానులున్నాడు. ద ఐకాన్ ఆఫ్ మిలియన్స్, సక్సెస్ స్టోరీ ఆఫ్ విజయ్‌ లాంటి పుస్తకాలు రాసిన రచయితలూ ఉన్నారు. భార్య సంగీత.. ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు అతని జీవితంలో మరింత ఆనందాన్ని నింపారు. అలా అని అంతా సాఫీగానే సాగిపోయిందని చెప్పడానికి లేదు. అతని లైఫ్‌లోనూ కొన్ని వివాదాలు ఉన్నాయి.  ఇన్‌కమ్‌ట్యాక్స్ గొడవలూ.. అజిత్‌ ఫ్యాన్స్ తో  కనిపించని యుద్ధాలూ.. తండ్రితో పొలిటికల్ ఇష్యూలూ.. తామే విజయ్ అసలు తల్లిదండ్రులమని క్లెయిమ్ చేసుకునే కొందరితో తలనొప్పులూ  విజయ్ జీవితంలో  ఇవి కూడా ఉన్నాయి.  కానీ ఎన్ని సమస్యలున్నా, ఏ ఇబ్బందులు ఎదురైనా.. విజయ్‌ ఈజ్ విజయ్. అతని నేమ్, ఫేమ్, కరిష్మా, స్టార్‌‌డమ్‌.. వీటికి తిరుగులేదు. 

వారసుడిగా వస్తున్న విజయ్..
దళపతి విజయ్ మొట్టమొదటి సారిగా తెలుగులో నేరుగా నటిస్తున్నాడు.  వారసుడు పేరుతో  తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది.  వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్..  మాస్‌ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.  ఇందులో విజయ్ బిజినెస్‌మెన్‌గా కనిపిస్తున్నాడు. అలాగే మొదటి సారిగా విజయ్ కు జోడీకి రష్మిక నటిస్తోంది.  ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు యాక్ట్ చేస్తున్నారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు విజయ్. ఈ మూవీతోనూ విజయ్ సత్తా చాటేలా ఉన్నాడు.