
దేశవ్యాప్తంగా 73 వ స్వాతంత్య్ర సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగుర వేయనున్నారు. ఆ తరువాత రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడనున్నారు. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులను కోట పరిసరాల్లో ఉంచనున్నారు.
ఉదయం 9 గంటల 5 నిమిషాలకు క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం కాన్వాయ్ బయలు దేరనుంది. 9 గంటల 15 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్ లోని అమరవీరుల స్థూపం దగ్గరకు చేరుకోనున్నారు. అమరు జవాన్లకు నివాళి అర్పించి 9 గంటల 25 నిమిషాలకు అక్కడి నుండి గోల్కొండ కోటకు బయలు దేరనున్నారు. 9 గంటల 45 నిమిషాలకు గోల్కొండ కోటకు చేరుకుంటారు. సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్ రెడ్డి సీఎంకు స్వాగతం పలకనున్నారు. 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి. ప్రజెంటేషన్ సెర్మనీ పూర్తయ్యాక 10 గంటల 35 నిమిషాలకు సీఎం గోల్కొండ కోట నుంచి క్యాంప్ ఆఫీసుకు బయలుదేరుతారు.
గోల్కొండ కోటలో వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, చేపట్టాల్సిన బందోబస్తుపై సీపీ అంజనీ కుమార్ అన్ని జోన్ల పోలీసులకి సూచనలు చేశారు. శాంతి భద్రతాలకు ఇబ్బంది కలుగకుండా 2 వేల మంది పోలీసులుతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. గోల్కొండ కోట మొత్తం బాంబ్, డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేశారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు 650 మంది కళాకారులును సిద్ధం చేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, సుపరిపాలనకు సంబంధించిన అంశాలపై సాంస్కృతిక బృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి . స్కూల్ విద్యార్థులుతో కూడా ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రెండు రెండు రోజులు ముందే విద్యార్థులు గోల్కొండ కోటకి చేరుకొని రిహార్సల్స్ చేశారు. పంద్రాగస్టు వేడుకలను చూసేందుకు వచ్చే వారి కోసం 5 భారీ ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.