అధికారుల వేధింపులు: ఆర్టీసీ కార్మికుల అరిగోస

అధికారుల వేధింపులు: ఆర్టీసీ కార్మికుల అరిగోస

‘‘కొంత మంది కండక్టర్లు, డ్రైవర్లు చాలా తక్కువ కలెక్షన్ తెస్తున్నారు.  కనీస ఈపీకే (ఎర్నింగ్‌‌ పర్‌‌ కిలోమీటర్‌‌) కూడా తేవడం లేదు. ఇకపై ఎవరైనా నిర్లక్ష్యంగా డ్యూటీ చేసి, తక్కువ ఎర్నింగ్స్‌‌ తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’.. ఇదీ మెహిదీపట్నం డిపో నోటీస్‌‌ బోర్డులో అధికారులు అంటించిన నోటీస్‌‌. రాష్ట్రవ్యాప్తంగా అనేక డిపోల్లో ఇదే పరిస్థితి ఉంది.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఆర్టీసీ కార్మికులు అరిగోస పడుతున్నారు. అధికారులేమో 100 శాతం స్టాఫ్ రావాలని ఆదేశాలిచ్చి చేతులు దులుపుకొన్నారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులను లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో డ్యూటీలకు వెళ్లేదారిలో పోలీసుల లాఠీదెబ్బలు, ఫైన్లు తప్పడం లేదు. డిపోలు, బస్టాండ్లలో నైట్ హాల్ట్ డ్యూటీలు వేస్తున్నా.. చాలా చోట్ల నిద్రపోవడానికిఫెసిలిటీస్‌‌‌‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో ఆదాయం ఎక్కువ రావడం లేదని డ్రైవర్లు, కండక్టర్లపై చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు డ్యూటీలు లేని డ్రైవర్లు, కండక్టర్లతో హమాలీ పనులు చేయిస్తున్నారు. ఇన్ని బాధలు పడుతున్నా  యూనియన్లు లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఆదాయం పెంచాలని నోటీసులు
ఆర్టీసీలో 49,733 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించారు. మొదట ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకే బస్సులు నడిచాయి. ఇటీవల సడలింపులో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటవరకు పెంచారు. అయితే కరోనా భయంతో జనాలు పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సొంత వాహనాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. అధికారులు మాత్రం ఆదాయం పెంచాలని డ్రైవర్లు, కండక్లర్లపై ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు డిపోల్లో నోటీసులు అంటిస్తున్నారు. కరోనా టైంలో జనాలు ప్రయాణించకుంటే తామేం చేస్తామని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవర్లు, కండక్టర్లు హమాలీలైన్రు..
బస్సుల ట్రిప్స్‌‌‌‌ తగ్గించడంతో డ్యూటీలు లేక చాలా మంది ఉద్యోగులు ఖాళీగా ఉంటుండడంతో, వారిని అధికారులు ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నారు. కార్గో, పార్సిల్‌‌‌‌, కొరియర్‌‌‌‌ సర్వీసుల్లో భాగంగా హమాలీ పనులు చేయిస్తున్నారు. సరుకుల లోడింగ్‌‌‌‌, అన్‌‌‌‌లోడింగ్‌‌‌‌ చేయిస్తున్నారు. డిపోల్లో పారిశుధ్య పనులుకూ వాడుతున్నారు. బస్సులను క్లీన్‌‌‌‌ చేయిస్తున్నారు. ఎవరైనా ఇదేంటని అడిగితే ఉద్యోగం కావాలా వద్దా అని అధికారులు బెదిరిస్తున్నారు.
50 శాతం నిబంధన పట్టించుకోలె
లాక్‌‌‌‌డౌన్‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. 50% ఉద్యోగులు ఆఫీసులకొస్తే చాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ ఆర్టీసీలో100% స్టాఫ్‌‌‌‌ డ్యూటీలకు హాజరుకావాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డిపోల్లో నోటీసు బోర్డులపై నోటీసులు అంటించారు. రాకుంటే ఆబ్సెంట్ వేస్తామని హెచ్చరిస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లతోపాటు గ్యారేజెస్‌‌‌‌, ఆఫీసులు, వర్క్‌‌‌‌షాపుల్లో పనిచేసేవారంతా వేర్వేరు చోట్ల, దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఉదయం ఆర్టీసీ బస్సుల్లో డ్యూటీకి వచ్చినా, సాయంత్రం ఎలా వెళ్లాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక డ్యూటీలకు వచ్చే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఐడీ కార్డు చూపిస్తున్నా పోలీసులు వదిలిపెట్టడంలేదు. అనేక సార్లు లాఠీలతో కొట్టిన సందర్భాలున్నాయి. నిత్యం కేసులు రాయడం, ఫైన్లు విధిస్తున్నారు.
నైట్‌‌‌‌ హాల్ట్ డ్యూటీలు.. సౌలతుల్లేవ్
డ్రైవర్లు, కండక్టర్లకు అధికారులు అడ్డగోలుగా డ్యూటీలు వేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే డ్యూటీకి రావాలని ఆదేశిస్తున్నారు. దూర ప్రాంత సర్వీసులకు పంపినప్పుడు ఆ బస్సు మధ్యాహ్నం ఒంటి గంటలోపు తిరిగి బయలుదేరిన డిపోకు చేరుకోవడం వీలుకావడం లేదు. దీంతో వేరే డిపోలో నైట్ హాల్ట్ ఉండాల్సి వస్తోంది. కానీ ఆయా బస్టాండ్లు, డిపోల్లో నిద్రించడానికి సరైన ఫెసిలిటీస్‌‌‌‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి బస్సులపై పడుకుంటున్నారు. ఇన్ని బాధలు , సమస్యలున్నా ఎవరికి చెప్పుకోలేక కార్మికులు లోలోపల మదనపడుతున్నారు. యూనియన్ల స్థానంలో తెచ్చిన వెల్ఫేర్‌‌‌‌ కమిటీలు పనిచేయడంలేదు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

వేధింపులు మానుకోవాలె..
నైట్‌‌ డ్యూటీలో ఉండే కార్మికులకు కనీసం ఫెసిలిటీస్‌‌ ఉండడం లేదు. అధికారులు ఇష్టమొచ్చినట్లు డ్యూటీ వేస్తున్నారు. రాకుంటే చర్యలు తప్పవని బెదిరిస్తున్నారు. అధికంగా ఆదాయం తేవాలని వేధిస్తున్నారు. లాక్‌‌డౌన్‌‌లో జనం లేకుంటే డ్రైవర్లు, కండక్టర్లు ఏం చేస్తారు? ఇకనైనా వేధింపులు మానుకోవాలి.
                                                                                                                                                              - వీఎస్‌‌ రావు, ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌‌, జనరల్‌‌ సెక్రటరీ