ఊర్లల్ల జనంపై ఆగని వీడీసీల అరాచకాలు

ఊర్లల్ల జనంపై ఆగని వీడీసీల అరాచకాలు

వినకుంటే జుర్మానాలు.. ప్రశ్నిస్తే వెలివేతలు

ఉత్తర తెలంగాణలో దాదాపు 90 శాతం ఊర్లలో వీడీసీల పెత్తనం కొనసాగుతోంది. ఏకపక్షంగా  కుల, గ్రామ బహిష్కరణ శిక్షలు వేస్తున్నాయి. ఊరి  కట్టుబాటు అంటూ ప్రశ్నించిన వారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిర్ణయాల మీద కూడా వీడీసీల ప్రభావం ఉంటోంది. చాలా చోట్ల సర్పంచులు డమ్మీలుగా మారుతున్నారు. ఇసుక రవాణా, బెల్టు షాపులకు వేలం పాట కూడా వీడీసీ సభ్యులే నిర్వహిస్తున్నారు. ఈ చర్యలను ప్రశ్నిస్తే.. వేలు, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. కట్టకపోతే ఒంటరి వాళ్లను చేసి మానసికంగా వేధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో క్రిమినల్​ వివాదాల్లో కూడా వీడీసీలు కలుగజేసుకొని తీర్పులు ఇస్తున్నాయి. 

రాష్ట్రంలో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీల (వీడీసీ) ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీటి తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వారిని ఊరి నుంచి వెలివేస్తున్నాయి. బాధితులకు ఏ సాయమూ అందకుండా చేస్తున్నాయి. చివరికి మంచినీళ్లు కూడా అందనివ్వడం లేదు. వీటి నిర్ణయాలను పాటించకుంటే  లక్షలకు లక్షలు ఫైన్లు వేస్తున్నాయి. ఊర్లో ఏ చిన్న పంచాయితీ అయినా వీడీసీలు జోక్యం చేసుకొని రెచ్చిపోతున్నాయి. భూ తగాదాలు, పెండ్లిళ్లు, ఇరువర్గాల మధ్య గొడవలు, కుటుంబ కలహాల్లో కలుగజేసుకొని జరిమానాలు విధిస్తున్నాయి. ఆంక్షలతో దళిత, బీసీ కుటుంబాలను సతాయిస్తున్నాయి. డప్పు కొడితే ఇచ్చే కూలి పైసలు సాల్తలేవని, రేట్లు పెంచాలని అడిగినందుకు మొన్నామధ్య నిజామాబాద్​ జిల్లా దూస్​గాంలో 70 దళిత కుటుంబాలను స్థానిక వీడీసీ సభ్యులు వెలివేశారు. చాలా ఊర్లలో ఇదే పరిస్థితి ఉంది. ఏండ్ల నుంచి కొనసాగుతున్న వీడీసీల అరాచకాలు.. తెలంగాణ వచ్చినా ఆగడం లేదు. ఈ కమిటీలకు కొన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతుండటంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది. ముఖ్యంగా నిజామాబాద్​, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్​జిల్లాల్లో వీడీసీల రూల్స్​ మితిమీరుతున్నాయి. 

ఊర్లలో అందరూ కలిసికట్టుగా ఉండేందుకు, ఊరుమ్మడి కార్యక్రమాలను జరుపుకునేందుకు ఏర్పాటైన సర్వసమాజ్​ కమిటీలు క్రమంగా ఊర్ల మీద పెత్తనం చేసే విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీలు (వీడీసీలు)గా మారాయి. నిజామాబాద్  తదితర జిల్లాల్లో ఈ కమిటీలు 40 ఏండ్లుగా పనిచేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు ఊర్లలో 1978 లోనే మొదట సర్వసమాజ్ కమిటీలు ఏర్పడ్డాయి. ప్రారంభంలో గ్రామాల్లో ఉత్సవాలు, జాతరలను ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేకుండా నిర్వహించేందుకే ఇవి పరిమితమయ్యాయి. పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చాక1988 నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు కావడంతో అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండిపడింది. మొట్టమొదట ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో సర్వసమాజ్​ కమిటీల స్థానంలో వీడీసీల ఏర్పాటు మొదలై, క్రమంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వ్యాపించాయి. ఈ వీడీసీలలో గ్రామ జనాభాను బట్టి‌‌ ప్రతి కుల సంఘం నుంచి కనిష్టంగా ఇద్దరిని, గరిష్టంగా నలుగురిని నామినేట్​ చేస్తారు. ఇందులో ఎక్కువగా అగ్రవర్ణాలకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఒక్కో గ్రామంలో వీడీసీలో 30 నుంచి 60 మంది దాకా సభ్యులను ఎన్నుకుంటారు. ఈ సభ్యులే తమలోంచి  వీడీసీ చైర్మన్​, వైస్​ చైర్మన్, ప్రధాన కార్యదర్శి, క్యాషియర్​ను ఎన్నుకుంటారు. వీడీసీ కాలపరిమితి ఒక ఏడాది ఉంటుంది. కానీ పాత కమిటీలే ఎక్కువ వరకు కంటిన్యూ అవుతుంటాయి. కొన్ని గ్రామాల్లో వీడీసీ చైర్మన్లు ఏకంగా పదేండ్లుగా కొనసాగుతున్నారు. ఇక  రిజర్వేషన్ల ప్రకారం  సర్పంచులుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నా ఎలాంటి లాభం లేదు. పెత్తనమంతా వీడీసీ చైర్మన్లదే. వైన్స్, బెల్టుషాపులు, ఇసుక క్వారీలు, పంచాయతీ స్థలాల్లోని షాపులు, సంతల వేలం, జరిమానాల ద్వారా వచ్చే ఆదాయంతో ఇవి నడుస్తాయి. ఈ వీడీసీల చైర్మన్లుగా ఎక్కువ శాతం ఉన్నత కులాలకు చెందిన వ్యక్తులు, పెత్తందార్లు ఉండడం వల్ల వీళ్లను ఎదిరించే పరిస్థితి లేకుండా పోతోంది. ఊర్లలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఇవి అనుమతిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే.. వెలివేతలకు గురిచేస్తున్నాయి. అనవసర విషయాల్లో కూడా ఈ కమిటీలు కలుగజేసుకొని జనాన్ని తిప్పలు పెడుతున్నాయి. బాధితుల్లో ఎక్కువగా దళితులు ఉంటున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో ప్రస్తుతం 154  వీడీసీలు ఉన్నాయి. ఊర్లలో కమిటీలు బలంగా ఉండడంతో పొలిటికల్​ పార్టీలు కూడా వీటికి అండగా ఉంటున్నాయి. 

బాధితుల్లో దళితులే ఎక్కువ

దళితులు, బలహీనవర్గాల మీద వీడీసీలు, కులపెద్దల పెత్తనం, వివక్ష ఎక్కువగా కనిపిస్తోంది. దళిత కుటుంబాలనైతే ఎంత చిన్న గొడవైనా వెలివేస్తున్నాయి. వెలివేసిన కుటుంబాలకు ఎవరూ సాయం చేకూడదని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వరాదని, వారిని పనులకు పిలవొద్దని వీడీసీలు ఆంక్షలు పెడుతున్నాయి. వెలికి గురైన వాళ్లతో ఎవరైనా మాట్లాడినా.. సాయం చేసినా వారికి  రూ.5 వేల వరకు జరిమానా  విధిస్తున్నాయి.  మొన్న నిర్మల్​ జిల్లా కడ్తాల్‍లో ఆత్మహత్య చేసుకున్న రైతు, నిజామాబాద్​జిల్లా దూస్​గాంలో బహిష్కరణకు గురైన 70 కుటుంబాలవారు దళితులే. 

వీడీసీల ఆగడాలకు కొన్ని ఉదాహరణలు..
పది రోజుల కిందట నిజామాబాద్​ జిల్లా డిచ్‍పల్లి మండలం దూస్‍గాం గ్రామానికి చెందిన 70 దళిత కుటుంబాలను సర్పంచ్, వీడీసీ మెంబర్లు ఊరి నుంచి వెలివేశారు. డప్పుల కూలీ రేట్లు పెంచాలని అడిగినందుకు ఈ శిక్ష వేశారు. 
నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్​గ్రామంలో దళిత కుటుంబాలను రెండేండ్ల కిందట వీడీసీ వెలివేసింది. బుద్ధవిహార్​ స్థలానికి సంబంధించిన గొడవలతో ఈ శిక్ష విధించింది. గత నెల 30న గ్రామానికి వచ్చిన బైంసా ఏఎస్పీ ప్రభాకర్​ను బాధిత దళితులు కలిసి వెలి వేసిన విషయాన్ని వివరించారు. వీడీసీలను వెంటనే రద్దు చేయాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. 
నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ఇటీవల నర్సయ్య అనే రైతుకు చెందిన అర ఎకరం స్థలాన్ని వీడీసీకి ఇవ్వాలని కమిటీ సభ్యులు తీర్మానించారు.  ఇందుకు నిరాకరించడంతో ఆయనను ఊరి నుంచి వెలివేశారు. ఊర్లో ఎవరైనా నర్సయ్యకు  సహకరిస్తే రూ. 20 వేలు జరిమానా కట్టాలని ఫర్మానా జారీ చేశారు. 
నిజామాబాద్​ మండలం బాల్కొండలో జులై 24న 40 కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. డీజిల్ రేట్లు పెరిగినందున వ్యవసాయ పనులకు వినియోగించే  ట్రాక్టర్ల చార్జీలను పెంచాలని ట్రాక్టర్​ఓనర్లు వీడీసీని కోరారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. వారి ట్రాక్టర్లను ఎవరూ వాడుకోవద్దని,  పొలాలను కౌలు తీసుకోరాదని, ఆ  కుటుంబాల వారిని కూలీ పనులకు పిలువరాదని రూల్స్​ పెట్టింది.