
న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందు కు సిద్ధం అవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి మాదిరిగా సునీత కూడా సీఎం అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ కూటమి బీజేపీకి సవాల్ విసురుతోందని మీడియా అడగగా, ‘‘ఏ కూటమి.. ఏం సవాల్. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులనే ప్రకటించలే. అవినీతిపై పోరాటం పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన ఆప్ నేతలు, అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు” అని హర్దీప్ సింగ్ అన్నారు. ఈడీ పంపిన తొమ్మిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించక పోవడం వల్లే అధికారులు ఆయన ఇంటికి వెళ్లారన్నారు.