త్రిపాఠికి పిలుపు.. పాండ్యాకు కెప్టెన్సీ

త్రిపాఠికి పిలుపు.. పాండ్యాకు కెప్టెన్సీ
  • ఐర్లాండ్‌తో రెండు టీ20లకు టీమిండియా ఎంపిక
  • శాంసన్‌, సూర్యకుమార్‌కు చోటు

న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌‌లో ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో ఇరగదీసి.. కెప్టెన్‌‌గా గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను తొలి సీజన్‌‌లోనే విజేతగా నిలిపిన టీమిండియా స్టార్‌‌ ప్లేయర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాకు ప్రమోషన్‌‌ లభించింది. ఐపీఎల్‌‌15లో తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్న పాండ్యా.. టీమిండియా కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. రెండు టీ20ల సిరీస్‌‌ కోసం ఐర్లాండ్‌‌ టూర్‌‌కు వెళ్లే టీమ్‌‌ను నడిపించనున్నాడు. ఈ మేరకు ఆలిండియా సీనియర్‌‌ సెలక్షన్‌‌ కమిటీ బుధవారం టీమిండియాను ప్రకటించింది. ఇంగ్లండ్‌‌తో ఏకైక టెస్ట్‌‌ మ్యాచ్‌‌ కోసం సీనియర్లందరూ ఇంగ్లండ్‌‌ బాట పట్టడంతో సౌతాఫ్రికాతో ఆడుతున్న టీమ్​నే దాదాపు కొనసాగించింది. అయితే,  ఐపీఎల్‌‌లో సన్​రైజర్స్​ తరఫున దుమ్మురేపిన రాహుల్‌‌ త్రిపాఠికి తొలిసారి నేషనల్‌‌ టీమ్‌‌లోకి తీసుకుంది. ఈ సీజన్‌‌లో త్రిపాఠి 37.54 సగటుతో 413 రన్స్‌‌ చేశాడు. మిడిలార్డర్‌‌ బలోపేతం కోసం సూర్యకుమార్‌‌ యాదవ్‌‌తో పాటు  సంజూ శాంసన్‌‌ను మళ్లీ టీమ్‌‌కు ఎంపిక చేశారు. ముంజేతి గాయంతో  ఐపీఎల్‌‌ మధ్యలోనే వైదొలిగిన సూర్య సౌతాఫ్రికా సిరీస్‌‌కు దూరంగా ఉన్నాడు.  సఫారీలతో సిరీస్‌‌లో టీమ్‌‌ను నడిపిస్తున్న స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌, ఐపీఎల్‌‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, విరాట్‌‌ కోహ్లీ, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, మహ్మద్‌‌ షమీతో కలిసి ఇంగ్లండ్‌‌కు వెళ్లనున్నాడు. దాంతో, అతని ప్లేస్‌‌లో ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యాను కెప్టెన్‌‌గా, భువనేశ్వర్‌‌ కుమార్‌‌ను వైస్‌‌ కెప్టెన్‌‌గా నియమించారు. కీపర్‌‌గా సీనియర్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌కు అవకాశం ఇచ్చారు. అతనికి బ్యాకప్‌‌గా ఇషాన్‌‌ కిషన్‌‌, శాంసన్‌‌ ఉంటారు.  డబ్లిన్‌‌ వేదికగా ఈ నెల 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌‌తో ఇండియా రెండు టీ20ల్లో పోటీ పడుతుంది. ఈ సిరీస్‌‌లో టీమ్​కు ఎన్‌‌సీఏ డైరెక్టర్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ కోచ్‌‌గా వ్యవహరిస్తాడు. హార్దిక్‌‌సేన ఈ సిరీస్‌‌ ఆడుతుండగానే రోహిత్‌‌ శర్మ నాయకత్వంలోని టెస్టు జట్టు.. ఇంగ్లండ్‌‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌‌కు సన్నద్ధం అవుతుంది. ఐర్లాండ్‌‌తో సిరీస్‌‌ పూర్తయిన వెంటనే హార్దిక్‌‌ టెస్టు టీమ్‌‌లో కలవనున్నాడు. 

ఇంగ్లండ్‌‌తో టెస్ట్‌‌కు రాహుల్‌‌ దూరం!

కాలిపిక్క కండర గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌‌‌‌‌‌కు దూరమైన ఓపెనర్‌‌‌‌ కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌.. జులై (1–5)లో ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే ఏకైక టెస్ట్‌‌‌‌కు కూడా దూరమయ్యేలా ఉన్నాడు.  ప్రస్తుతం రిహాబిలిటేషన్‌‌‌‌లో ఉన్న అతను పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దీంతో గురువారం తెల్లవారుజామున ఇంగ్లండ్‌‌‌‌ బయలుదేరే టీమ్‌‌‌‌తో పాటు అతను వెళ్లడం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వారాంతంలో జరిగే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ పరీక్షలో రాహుల్‌‌‌‌ పాస్‌‌‌‌ అయితే అప్పుడు ఇంగ్లండ్‌‌‌‌ వెళ్లే చాన్స్‌‌‌‌ ఉండొచ్చు. ఇక,  కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌, కోహ్లీ, పుజారా, బుమ్రా, షమీ లండన్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ ఎక్కనున్నారు. రాహుల్‌‌‌‌ అందుబాటులో లేకపోతే.. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ అతనూ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో లేకపోతే పుజారాను ఓపెనర్​గా పంచే అవకాశం ఉంది.  

జట్టు: హార్దిక్‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), భువనేశ్వర్‌‌‌‌, ఇషాన్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌, శాంసన్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా, రాహుల్‌‌‌‌ త్రిపాఠి, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (కీపర్​), చహల్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, రవి బిష్ణోయ్‌‌‌‌, హర్షల్‌‌‌‌ పటేల్‌‌‌‌, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, అర్ష్​దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌.