షార్ట్ సర్క్యూట్​తో హార్డ్ వేర్ షాపు దగ్ధం.. రూ. 4 కోట్ల ఆస్తి నష్టం

షార్ట్ సర్క్యూట్​తో హార్డ్ వేర్ షాపు దగ్ధం.. రూ. 4 కోట్ల ఆస్తి నష్టం

ముగ్గురిని రెస్క్యూ చేసిన పోలీస్, ఫైర్ సిబ్బంది

వికారాబాద్, వెలుగు : ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి హార్డ్ వేర్ షాపు, బిల్డింగ్ కాలిపోగా.. రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ టౌన్ బీజేఆర్ చౌరస్తా సమీపంలో నేనావత్ కృష్ణ హార్డ్ వేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం షాప్ లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందడంతో వికారాబాద్ సీఐ నాగరాజు ఫైర్ సిబ్బందితో వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే బిల్డింగ్ లో ముగ్గురు చిక్కుకోగా ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.  మంటలను ఆర్పేందుకు నాలుగు గంటలు శ్రమించారు. దాదాపు రూ. 4 కోట్ల  ఆస్తి నష్టం జరిగింది.  వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కమిషనర్ జాకీర్ అహ్మద్ సిబ్బందితో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థికసాయం అందించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి  బాధితులను ఓదార్చారు.  షాప్ యజమానిని ఆర్థికంగా ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చారు.  వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రూ.25 వేలు, సీపీసీ జువెలరీ ఓనర్ అశోక్ రూ. 10 వేలు, కౌన్సిలర్ సురేశ్​ రూ.5వేలు సాయంగా బాధిత కుటుంబానికి అందజేశారు.