సమ్మోహన వేణుగాణం..

సమ్మోహన వేణుగాణం..

‘సిరివెన్నెల’ చూసినవాళ్లెవరైనా ఆ సినిమాని మర్చిపోగలరా! ముఖ్యంగా ఆ వేణుగానాన్ని మళ్లీ మళ్లీ వినాలని అనుకోకుండా ఉండగలరా! సినిమాకి ప్రాణం పోసిన ఆ మాధుర్యాన్ని అందించింది ఎవరో తెలుసా.. ప్రపంచ ప్రసిద్ధ వేణుగాన విద్వాంసులు. హరి ప్రసాద్ చౌరాసియా. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హరి ప్రసాద్ చౌరాసియా గురించి కొన్ని విశేషాలు..

1938లో అలహాబాద్‌లో జన్మించారు హరిప్రసాద్ చౌరాసియా. నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. తండ్రి మల్లయోధుడు. కొడుకుని కూడా తనలానే చేయాలనుకున్నారు. కానీ హరిప్రసాద్‌కి అది ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి మనసంతా సంగీతం మీదే. నాన్న  తిడతారని కొన్నాళ్లు వ్యాయామశాలకు వెళ్లారు.  తండ్రికి తెలియకుండా రహస్యంగా సంగీతం కూడా నేర్చుకున్నారు. ఇంట్లో సాధన చేస్తే తెలిసిపోతుందని ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు.

ఆలిండియా రేడియోలో కచేరీలు
15వ ఏట పక్కింట్లో ఉన్న పండిట్ రాజారామ్ దగ్గర సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు హరిప్రసాద్. వారణాసికి చెందిన భోలానాథ్ దగ్గర ఫ్లూట్ వాయించడం నేర్చుకుని.. ఆల్ ఇండియా రేడియోలో కచేరీలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బాబా అల్లావుద్దీన్ ఖాన్ కూతురు అన్నపూర్ణాదేవి దగ్గర కూడా శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్‌ను ప్రాణం కంటే మిన్నగా భావించేవారు హరిప్రసాద్. వేణుగానంలో ఎన్నో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టారు. సంతూర్ వాద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మతో కలిసి ఎన్నో కచేరీలు చేశారు. వారి జుగల్‌బందీ ‘శివ – హరి’గా ఫేమస్ అయ్యింది. 

ఆల్బమ్ కోసం ఎదురుచూపులు
హరిప్రసాద్ ఆల్బమ్స్‌ ఏ రేంజ్‌లో అమ్ముడుపోయేవంటే.. నెక్స్ట్ ఆల్బమ్ ఎప్పుడొస్తుందా అని అందరూ కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూసేవారు. కృష్ణధ్వని, కాల్ ఆఫ్ ద వ్యాలీ, మేఘ్ మల్హర్, ఇమ్మోర్టల్ సిరీస్, నైట్ రాగాస్, మార్నింగ్ టు మిడ్‌ రాగాస్ ఇలా ఆయన విడుదల చేసిన ఎన్నో ఆల్బమ్స్‌ ప్రేక్షకుల్ని సంగీత సాగరంలో ఓలలాడించాయి. ‘బీటిల్స్’ వంటి ఇంటర్నేషనల్ మ్యూజికల్ బ్యాండ్స్తో కూడా చౌరాసియా కొలాబరేట్ అయ్యారు. కెన్ లాబర్ లాంటి చాలామంది ప్రముఖ మ్యుజీషియన్స్ తో కలిసి పర్‌‌ఫార్మ్ చేశారు.

బాలీవుడ్ సినిమాలకు సంగీతం
శివకుమార్‌‌తో కలిసి పలు బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించారు చౌరాసియా. చాందిని, డర్, లమ్హే, సిల్‌సిలా, ఫాస్‌లే, విజయ్, పరంపర, సాహిబా లాంటి మూవీస్‌కి వీరు అందించిన సంగీతం అందరినీ అలరించింది. ఈ చిత్రాల్లోని కొన్ని పాటల్ని ఇప్పటికీ క్లాసిక్స్ గా చెబుతుంటారు. ‘సిక్స్టీన్ డేస్ ఇన్ అఫ్గానిస్థాన్‌’ అనే ఇంగ్లిష్ మూవీలో మేకర్స్ కొన్నిచోట్ల చౌరాసియా సంగీతాన్ని వాడుకున్నారు . 

చెవుల్లో అమృతం పోసినట్లు
‘సిరివెన్నెల’ సినిమా మొత్తం ఓ చూపులేని ఫ్లూటిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతను మాట్లాడేది తక్కువ, వేణుగానాన్ని వినిపించేది ఎక్కువ. చాలా సందర్భాల్లో సంగీతంతోనే మాట్లాడతాడు. అందుకే సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఆ బాధ్యతని హరిప్రసాద్ చేతుల్లో పెట్టారు. ఆ సినిమా కోసం చౌరాసియా ప్లే చేసిన ఫ్లూట్ బిట్స్‌ వింటే ఇప్పటికీ చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుందని సంగీత ప్రియులు అంటుంటారు. 

పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు
ముంబై, ఒరిస్సాల్లోని పిల్లలకు సంగీత పరిజ్ఞానాన్ని పెంచే ఉద్దేశంతో గురుకుల సంగీత పాఠశాలల్ని ఏర్పాటు చేశారు చౌరాసియా. పేద పిల్లలు ఎవరైనా సరే.. ఇక్కడ ఫ్రీగా మ్యూజిక్ నేర్చుకోవచ్చు. తన కెరీర్‌‌లో ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాల్ని అందుకున్నారు హరిప్రసాద్. 1984లో సంగీత నాటక్ అకాడెమీ అవార్డు వరించగా.. ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. రెండు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లను కూడా ప్రదానం చేశాయి. 

బన్సురీ గురు పేరుతో డాక్యుమెంటరీ
2013లో హరిప్రసాద్‌పై ఒక డాక్యుమెంటరీ వచ్చింది. ‘ బన్సురీ గురు’ పేరుతో ఆయన కొడుకు రాజీవ్ చౌరాసియానే దీన్ని తీశాడు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్‌ దీన్ని నిర్మించింది. హరిప్రసాద్ చౌరాసియాపై ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు. ‘బ్రెత్ ఆఫ్ గోల్డ్’ పేరుతో సత్య శరణ్ అఫీషియల్ బయోగ్రఫీ రాశారు. ఇంకా హరిప్రసాద్ చౌరాసియా: రొమాన్స్ ఆఫ్ ద బాంబూ రీడ్, వుడ్‌విండ్స్ ఆఫ్ చేంజ్, హరిప్రసాద్ చౌరాసియా అండ్ ద ఆర్ట్ ఆఫ్ ఇంప్రవైజేషన్, బన్సురీ సామ్రాట్‌ తదితర పుస్తకాలు ఆయన ప్రతిభను, జీవితాన్ని కళ్లకు కట్టాయి. 

బాధను మరిపించే సంగీతం
చౌరాసియా మొదట కమలాదేవిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. ఆ తర్వాత సింగర్ అనూరాధని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు. ఆయనకి ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు. రోగాల్ని తగ్గించే శక్తి రాగాలకు ఉందంటారు. ఎంతటి బాధనైనా మరిపించే మత్తు సంగీతంలోనే ఉందని చెబుతారు. హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం వింటే అది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది. అంతటి ప్రతిభావంతుడు మన దేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన సంగీతం మరింతకాలం పాటు నేల నాలుగు చెరగులా వినిపించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే హరి ప్రసాద్ చౌరాసియా.