
ఇండియాతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. ఆట లేదు కానీ ఓవరాక్షన్ మాత్రం ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ కు ఓ రేంజ్ లో ఉంటుంది. వివాదాస్పద సైగలు.. కామెంట్లతో ఐసీసీ నుంచి ఫైన్ తో పాటు వార్నింగ్ తీసుకున్న రౌఫ్.. ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియాతో జరిగిన ఫైనల్లో పాక్ జట్టు ఓటమికి కారణమయ్యాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ ఫైనల్లో ఈ పాక్ పేసర్ 3.4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడ పడగొట్టలేకపోయాడు. మిగిలిన పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా రౌఫ్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
రౌఫ్ ప్రదర్శనతో పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. సొంత దేశం అయినప్పటికీ ఈ పాక్ పేసర్ ను బహిరంగంగానే విమర్శించాడు. అక్రమ్ మాట్లాడుతూ.. " రౌఫ్ పాకిస్థాన్ జట్టుకు బౌలింగ్ లో రన్ మెషీన్. దురదృష్టవశాత్తు అతను ఇండియా తరపున ఆడేటప్పుడు భారీగా పరుగులిస్తాడు. నేను మాత్రమే కాదు.. దేశం మొత్తం అతన్ని విమర్శిస్తోంది. అతను ఎప్పటికీ బెటర్ అవుతాడని నేను భావించడం లేదు. రెడ్-బాల్ క్రికెట్ ఆడటానికి నిరాకరించిన రౌఫ్ మీ జట్టులో ఉండకూడదు. అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడకూడదని తీసుకున్న నిర్ణయానికి ధన్యావాదాలు". అని అక్రమ్ సోనీ స్పోర్ట్స్‌తో అన్నారు.
రవూఫ్ ఇండియాతో జరిగిన ఏడు టీ20 మ్యాచ్‌ల్లో 25.6 యావరేజ్.. 8.66 ఎకానమీ రేటుతో 231 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్‌లో రౌఫ్ ను ఇండియన్ బ్యాటర్లు టార్గెట్ చేస్తూ భారీగా పరుగులు రాబట్టారు. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా విజయానికి చివరి 6 ఓవర్లలో 64 పరుగులు కావాల్సిన దశలో రౌఫ్ వేసిన 15 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లో అఫ్రిది 6 పరుగులే ఇచ్చినా 18 ఓవర్లో మళ్ళీ రౌఫ్ 13 పరుగులు ఇచ్చి ఇండియా ఛేజింగ్ ఈజీ చేశాడు. 19 ఓవర్లో ఫహీమ్ అష్రాఫ్ 7 పరుగులే ఇచ్చినప్పటికీ.. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా.. తొలి నాలుగు బంతుల్లోనే 13 పరుగులిచ్చి మ్యాచ్ ఫినిష్ చేశాడు.