సిట్.. స్క్రిప్ట్ ఇన్వెస్టిగేషన్ అయింది : హరీశ్ రావు

సిట్.. స్క్రిప్ట్ ఇన్వెస్టిగేషన్ అయింది : హరీశ్ రావు
  • సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిట్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలా కాకుండా.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా రేవంత్ మార్చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై లీకులు ఇస్తున్నారని, వాటికి ఆధారాలు ఏంటని ప్రశ్నించారు. 

కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణభవన్ లో హరీశ్ మీడియాతో మాట్లాడారు. “మొన్న నేను ఇన్వెస్టిగేషన్​కి వెళ్లినప్పుడు కూడా నాపై ఇలాంటి దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి జరిగింది వేరు. బయట లీకులు ఇస్తూ ప్రచారం చేయించిన స్క్రిప్ట్ వేరు. ఒకరకంగా ఇది రాజ్యాంగం మీద దాడి. ఈ లీకులకు ఎవరు బాధ్యత వహించాలి? లీకులు చేసిన వాళ్ల పరిస్థితి ఏంటనేది వాళ్లు ఆలోచించుకోవాలి” అని హరీశ్ అన్నారు.

సృజన్ బాగోతం బయటపెట్టినందుకే..

రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బాగోతాన్ని ఆధారాలతో బయటపెట్టినందుకే ఈ తతంగమంతా ప్రారంభమైందని హరీశ్ తెలిపారు. ‘‘తెలంగాణ సిరుల గని.. సింగరేణి అని అనేవాళ్లు. కానీ, ఇప్పుడది సింగరేణి సృజన్ గనిగా మారిపోయింది. ఒక మంత్రి తన సోదరుడి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆ మంత్రి ఏకంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరు అని అధికారికి ఉత్తరం రాసిండు. 

ఈ వాటాల లొల్లి కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. సిట్ పేరు మీద రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు. ఇదొక మైన్ బ్లాక్ కుంభకోణం కాదు. ఇది చాలా పెద్ద స్కామ్. బావమరిది సృజన్ రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. ఇది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు” అని హరీశ్ అన్నారు.

3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్

కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు స్కాం మాత్రమే కాకుండా.. సింగరేణిలో సోలార్ పవర్ స్కాం కూడా చేస్తున్నదని హరీశ్ ఆరోపించారు. “107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద కుంభకోణం జరిగింది. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టేది ఉంటే తమ అనుచరులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి ఎమ్మెస్ఎంఈలు పాల్గొనకుండా ఉండేందుకు 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారు. ఈ టెండర్​ను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పజెప్పారు” అని హరీశ్ తెలిపారు. ‘‘ఒక మెగావాట్ సోలార్​ పవర్ ఉత్పత్తికి రూ.7 కోట్ల చొప్పున.. రూ.480 కోట్లకు దాన్ని అప్పగించారు. 

రెండేండ్లుగా కోల్​ మినిస్టర్​గా ఉన్న కిషన్ రెడ్డి దీని గురిం చి పట్టించుకోలేదు’’అని హరీశ్ విమర్శించారు. ఇక, సింగరేణిలో పేలుళ్లకు వాడే జిలెటిన్ స్టిక్స్​ను 30 శాతం ఎక్కువ రేటుపెట్టి కొనాలని ప్రభుత్వ పెద్దలు జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్​పై ఒత్తిడి తెచ్చారని, ఆయన నిరాకరించినా ఒత్తిళ్లు తగ్గకపోవడంతో రాజీనామా చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ఇంకో డైరెక్టర్ వీకే శ్రీనివాస్ కూడా సంతకం పెట్టేందుకు నిరాకరిస్తే.. ఆయన్ను డైరెక్టర్ నుంచి జీఎం పదవికి రివర్స్ చేశారని హరీశ్ అన్నారు.