నిరుద్యోగులను మోసం చేసిన్రు కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

నిరుద్యోగులను మోసం చేసిన్రు కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కాంగ్రెస్​నేతలు నిరుద్యోగులను మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆరోపించారు. ఎన్నికల ముందు వేడుకొని.. వాడుకొని, అధికారంలోకి వచ్చాక వదిలేశారని విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించి.. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారని ఫైర్​అయ్యారు.  తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో నిర్వహించిన ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ ’ కార్యక్రమానికి హరీష్ రావు  హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి.. పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని సవాల్​విసిరారు. సీఎం.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ.. రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారని విమర్శలు గుప్పించారు.  జాబ్ క్యాలెండర్ లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా ?  2లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్,  రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందన్నారు.  

నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటా: ఆర్ కృష్ణయ్య

జెన్​కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వైఖరి అవలంబిస్తోందని ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేయాలని, ఈ నిరుద్యోగ జేఏసీ ఇక్కడితో ఆగిపోవద్దని ఆయన సూచించారు. నిరుద్యోగుల ప్రత్యక్ష పోరాటానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. ఎక్కడ పోరాటాలు జరిగినా ఎర్రజెండా అండగా ఉంటుందని, ఈ నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో విడుదలైన తెలంగాణ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కేవలం ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి యువత తమ హక్కులు సాధించుకోవాలన్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఏనుగుల రాకేశ్ రెడ్డి,  గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.