
- జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం
- రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోలు నిర్వహిస్తాం
- నీళ్లలో వాటా కోసం ఢిల్లీ మెడలు వంచుతం
- బీఆర్ఎస్వీ మీటింగ్ లో హరిశ్ రావు వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ ఉద్యమ సంస్థ అని వ్యాఖ్య
హైదరాబాద్: ఉస్మానియా, కాకతీయతో పాటు తెలంగాణలో యూనివర్సిటీలే ఉద్యమ వేదికలుగా బనకచర్లపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తన చేతుల్లో ఉన్నారని చంద్రబాబు బనకచర్ల కడితే మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుందని అన్నారు. ఇవాళ నాచారంలో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బనకచర్లపై అవసరమైతే జాతీయ రహదారులను దిగ్బంధనం చేస్తామని, అవసరమైతే రైల్ రోకోలు నిర్వహిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఉద్యమ సంస్థ అని, అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అన్నారు.
మంత్రి ఉత్తమ్ ను నిద్రలేపింది తామేనని చెప్పుకొచ్చారు. బనకచర్లపై బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడటం లేదన్నారు. రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనక చర్లను తిరస్కరిస్తే మళ్ళీ జల శక్తి మంత్రి మీటింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీని వెనక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలుజరుగుతుంటే రాష్ట్ర ఎంపీలు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరని అన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి బడ్జెట్ తేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.