యువతను మోసం చేస్తున్న కేంద్రం

యువతను మోసం చేస్తున్న కేంద్రం
  • అగ్నిపథ్ ​ఉద్యోగాలు తుమ్మితే ఊడుతయ్
  • యువతను మోసం చేస్తున్న కేంద్రం: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, వెలుగు:  అగ్నిపథ్ ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయేవని, యువతను మోసం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చిందని మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16.5 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 1.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, ఈ ఏడాది మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. ఇటీవల టెట్​లో అర్హత సాధించిన అభ్యర్థులతో బుధవారం సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో హరీశ్ రావు ముఖాముఖి నిర్వహించారు. బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టెట్ రాసిన వారిలో 32% మందే పాసైతే.. సిద్ధిపేటలోని కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 82% మంది ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమన్నారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతోందని, దానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 317 జీవో ఆంతర్యం తెలియకుండా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం, రద్దు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు.

ఆటోనగర్, బస్టాండ్ ల పరిశీలన

సిద్ధిపేట పట్టణ శివార్లలోని మందపల్లి వద్ద ఆటోనగర్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఆ ప్రాంత అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఆటోనగర్​ ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సిద్దిపేటలో కొత్తగా ప్రారంభించిన బస్టాండును మంత్రి హరీశ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణీకులకు అందే సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల తల్లుల కోసం ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని సూచించారు. అంతకు ముందు సిద్దిపేట నియోజకవర్గంలో 29 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​ చెక్కులను మంత్రి అందజేశారు. టెక్ మహేంద్ర సహాయంతో పట్టణంలోని మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మరోవైపు సిద్దిపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీల యువకులు మంత్రి హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి కండువా కప్పి హరీశ్​ పార్టీలోకి ఆహ్వానించారు.