- విద్యుత్ శాఖలో ఆంధ్రోళ్ల పెత్తనం నడుస్తున్నది
- ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రూ.82 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఒక యూనిట్ ను కేవలం రూ.4.12కే అందిస్తామని ఎన్టీపీసీ చెప్తున్నా.. ఆఫర్ ను కాదని, కొత్తగా థర్మల్ ప్లాంట్లు కడుతూ జేబులు నింపుకునేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చింది ప్రజా పాలన కాదు.. ఆంధ్రా ద్రోహుల పాలన. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మీలాగా 20, 30 శాతం కమీషన్లు తీసుకోవడం నాకు రాలేదు. అందుకే నేను అన్ ఫిట్ అయ్యాను. మా హయాంలో కాంట్రాక్టర్లు ఎప్పుడూ సెక్రటేరియెట్ ముందు ధర్నాలు చేయలేదు. ఇప్పుడు బిల్లుల కోసం సర్పంచ్లు, కాంట్రాక్టర్లు రోడ్డెక్కి అరెస్ట్ అవుతున్నారు’’అని హరీశ్ అన్నారు.
థర్మల్ ప్లాంట్ల వెనుక పెద్ద స్కామ్
కొత్తగా కడుతున్న థర్మల్ ప్లాంట్ల వెనుక వేల కోట్ల స్కాం దాగి ఉందని బీఆర్ఎస్ బయటపెడితే.. మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘‘ఎన్టీపీసీ నుంచి కరెంట్ కొంటే పైసా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. అదే ప్లాంట్లు కడితే యూనిట్ కు రూ.7.70 ఖర్చు అవుతది. ఈ లెక్కన 25 ఏండ్లలో ప్రజలపై రూ.82 వేల కోట్ల అదనపు భారం పడుతుంది”అని హరీశ్ ఆరోపించారు.
రిటైర్డ్ ఆంధ్రా అధికారులకు పదవులా?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ శాఖను ఆంధ్రా అధికారులతో నింపుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను పక్కనపెట్టి, రిటైర్డ్ ఆంధ్రా అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. ‘‘సింగరేణిలో రిటైర్ అయిన ఆంధ్రా వ్యక్తి రాజశేఖర్ రెడ్డిని జెన్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా వేశారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన కుమార్ రాజాను జెన్కోలో ఉద్యోగుల డైరెక్టర్ గా పెట్టారు’’అని హరీశ్ మండిపడ్డారు.
