నాడు కృష్ణాలో..  నేడు గోదావరిలో ద్రోహం.. బనకచర్లకు పాలమూరుతో లింక్‌‌‌‌‌‌‌‌ పెట్టడమంటే తెలంగాణ జలహక్కులను కాలరాయడమే: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

నాడు కృష్ణాలో..  నేడు గోదావరిలో ద్రోహం.. బనకచర్లకు పాలమూరుతో లింక్‌‌‌‌‌‌‌‌ పెట్టడమంటే తెలంగాణ జలహక్కులను కాలరాయడమే: హరీశ్‌‌‌‌‌‌‌‌రావు
  • ట్రిబ్యునల్​ ఇచ్చిన నీటి హక్కులపై రాజీపడటం రాష్ట్రానికి అన్యాయమే 
  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ తన గురువుకు తొత్తుగా మారిండు
  • జీసీ లింక్‌‌‌‌‌‌‌‌ ను కాదని.. పోలవరం నుంచి కావేరికి తరలించేలా కుట్రలు
  • దాని వల్ల సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి 47 టీఎంసీలు పోతాయని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: గోదావరి– నల్లమల సాగర్​ ప్రాజెక్టుకు పాలమూరుతో  లింకు పెట్టడమంటే తెలంగాణ జల హక్కులను కాలరాయడమేనని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కృష్ణా నీళ్ల విషయంలో కాంగ్రెస్​ పాలకులు ద్రోహం చేశారని, ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ నాయకులు డూడూ బసవన్నల్లాగా తలలూపుతున్నారని విమర్శించారు. ఆదివారం తెలంగాణభవన్​లో హరీశ్‌‌రావు మీడియాతో మాట్లాడారు. 

ట్రిబ్యునల్​ ద్వారా రాష్ట్రానికి వచ్చిన నీటి హక్కులపై రాజీపడడం ఎత్తుగడ కాదని, రేవంత్‌‌రెడ్డి తన గురువుకు తొత్తుగా మారి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ చేపట్టాలనుకున్న పోలవరం– బనకచర్ల, పోలవరం– నల్లమలసాగర్​ ప్రాజెక్టులు ఫెయిల్​ కావడంతో ఇప్పుడు గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టు పేరుతో ముందుకొస్తున్నారని అన్నారు. 

తెలంగాణలోని ఇచ్చంపల్లి నుంచి కేంద్రం చేపట్టాల్సిన జీసీ లింక్‌‌ను.. ఇప్పుడు ఏపీలోని పోలవరం –నల్లమలసాగర్​ ద్వారా తమిళనాడులోని గ్రాండ్​ ఆనికట్‌‌కు కలపాలని చూస్తున్నారన్నారు. నేషనల్​ ప్రాజెక్ట్​ కాబట్టి.. ఏపీ వాళ్లకు రూపాయి కూడా ఖర్చు కాదని చెప్పారు. మనకు కొత్తగా నీళ్లు వచ్చుడు కాదు కదా.. సమ్మక్కసాగర్‌‌‌‌కు ఉన్న 47 టీఎంసీల జలాలను మనం వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. వీటన్నింటికీ రేవంత్​, ఉత్తమ్​ డూడూ బసవన్నలాగా తలూపుతున్నారని మండిపడ్డారు.

రెండింట్లోనూ నష్టమే

గోదావరి– బనకచర్లకు అనుమతిస్తే.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వండని రేవంత్‌‌రెడ్డి అంటున్నారని, దాని వల్ల ఇటు పాలమూరు జిల్లాతోపాటు గోదావరిలోనూ నష్టం జరుగుతుందని హరీశ్‌‌రావు పేర్కొన్నారు. ‘‘ఉమ్మడి ఏపీకి బచావత్​ ట్రిబ్యునల్​ 811 టీఎంసీలు కేటాయించింది. బ్రజేశ్​ ట్రిబ్యునల్​ తీర్పు ప్రకారం మరో 194 టీఎంసీలు కలిపి 1,005 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఉంటాయి. అందులో ఎంత లేదన్నా 700 టీఎంసీలు తెలంగాణకు ప్రస్తుత ట్రిబ్యునల్​ ఇవ్వబోతున్నది. 

కానీ, పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు ఎన్వోసీ ఇస్తే.. మిగతా నీళ్లు విడిచిపెట్టుకుంటామని సీఎం రేవంత్​ అంటున్నరు. అదే చేస్తే ఏపీకే జలహక్కులు వెళ్తాయి. తెలంగాణకు నీళ్లు కట్​ అవుతాయి. ఇటు జీసీ లింక్‌‌లో వచ్చే నీళ్లు కూడా తెలంగాణకు రావు. మొత్తం ఏపీకే పోతయ్. గోదావరిలో 968 టీఎంసీలకుగానూ ఇప్పటికే 828 టీఎంసీలకు టీఏసీలు వచ్చాయి. మరో 139 టీఎంసీలకు అనుమతులు పెండింగ్​ఉన్నయ్​. 

పోలవరం–కావేరి లింక్‌‌ పూర్తయ్యాక మన ప్రాజెక్టులు అనుమతులు రావడం కష్టమైపోతుంది. మొత్తంగా అనుమతులు పెండింగ్‌‌లో ఉన్న 139 టీఎంసీలు, గోదావరి –కావేరి లింక్‌‌లో వచ్చే 74 టీఎంసీలు కలిపి 213 టీఎంసీలు మనకు నష్టం’’ అని  పేర్కొన్నారు. 

రహస్య సమావేశాలు పెట్టిన్రు..

పోలవరం–కావేరి లింకింగ్​పై సీక్రెట్​మంతనాలు జరుగుతున్నాయని హరీశ్‌‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్‌‌ కూడా ఒక మీటింగ్‌‌లో పాల్గొన్నారని చెప్పారు. ఈ ఏడాది మార్చి 26న ఏపీ మూలాలున్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, ఏపీ సెక్రటరీలు హైదరాబాద్‌‌లో మీటింగ్​ ఏర్పాటు చేశారని, ఇందులో సీఎం రేవంత్​ కూడా పాల్గొన్నారని ఆరోపించారు. ఆ తర్వాత ఏప్రిల్​ 27న ఢిల్లీలో కేంద్రజలశక్తి శాఖ కార్యదర్శి వద్ద, మే 1, మే 8, మే 11, మే 23న కూడా మీటింగ్‌‌లు జరిగాయని చెప్పారు. గత శుక్రవారం కూడా మీటింగ్​ నిర్వహించారన్నారు. ఇన్ని సమావేశాలు జరిగినా వాటి మినిట్స్‌‌ను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. 

‘‘తెలంగాణ తరఫున ఇరిగేషన్​ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​ హాజరవుతున్నరు. ఆయన చంద్రబాబుకు నమ్మినబంటు. ఆయన తప్ప ఇంజినీర్లను ఎవరినీ పంపడం లేదు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసమే రేవంత్​ ఇదంతా చేస్తున్నరు. గురుదక్షిణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నడు. 

కేంద్రం కూడా తెలంగాణపట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నది. నదుల అనుసంధానంలో తెలంగాణను ఎందుకు పక్కనపెడ్తరు? ఏపీ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలా? రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులున్నా ఏం చేస్తున్నరు? బండి సంజయ్​, కిషన్‌‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటరా..తెలంగాణ ద్రోహులుగా మిగులుతారా?’’ అని హరీశ్‌‌రావు  నిలదీశారు.