కాళేశ్వరం నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దే  : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు

కాళేశ్వరం నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దే  : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు

సిద్దిపేట, వెలుగు: కరువు ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ దేనని, పారే కాల్వలు, పచ్చని పంట పొలాలే కాళేశ్వరం నీళ్లకు సజీవ సాక్ష్యాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  హరీశ్ రావు అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం మైసంపల్లిలోని పెద్దమ్మ ఆలయ ఉత్సవాలకు హాజరై మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టు  వల్ల మన ప్రాంతానికి ఒక కళ  రావడమే కాకుండా ఇవాళ రెండు పంటలకు నీళ్లు అందుతున్నాయన్నారు.  కేసీఆర్​ఆశీస్సులతో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ  ప్రారంభమైందని, దీంతో తన జన్మ ధన్యమైందన్నారు.  మైసంపల్లికి ఎప్పుడూ వచ్చినా  నీళ్ల కోసం  బిందెలు అడ్డుపెడుతుండే వారు ఇప్పుడు ఎండాకాలంలో కూడా కాల్వల్లో నీళ్లు చూస్తున్నామన్నారు.

మార్చి వచ్చినా  రైతుబంధు పడ్త లేదని  మొత్తం ఐదు పంటల్లో మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారని,  రుణమాఫీ  సగమే అయిందని విమర్శించారు. అనంతరం వెంకటా పూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట పట్టణంలోని మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠా కార్యక్రమంలో, పాత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేసి ప్రత్యేక పూజలు చేశారు.