
- రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు: హరీశ్ రావు
- ఎన్సీఆర్బీ చెప్పిన లెక్కలే నిదర్శనమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రైతు ఆత్మహత్యల తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలను తీసుకొచ్చి.. సాగును బాగు చేశారని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలే స్పష్టం చేస్తున్నాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి తగ్గిందన్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. అందులో తెలంగాణ వాటా కేవలం 0.51 శాతమన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గాయన్నారు. ఇవి మాటలు కాదని.. కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం ఉండేదేన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆరేనన్నారు.
రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల ఫలమే ఈ సామాజిక మార్పు అని, తెలంగాణ కోరుకున్నది, బీఆర్ఎస్ సాధించింది ఇదేనన్నారు. రైతుల బలవన్మరణాలు తగ్గాయంటే.. అది కేసీఆర్ నాయకత్వ సత్తాకు, రైతు సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. సూర్యచంద్రులున్నంతకాలం అన్నదాతల ఆత్మబంధువుగా.. కర్షకుడి కన్నీళ్లు తుడిచిన వ్యక్తిగా కేసీఆర్ చిరస్థాయిలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు.