
హైదరాబాద్, వెలుగు: చలో సెక్రటేరియెట్ పేరిట నిరసన చేపట్టిన అంగన్‌వాడీ టీచర్లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడం బాధాకరమని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
"ప్రజా పాలన అని చెప్పుకుంటూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారా? ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా? గుర్తింపు లేదా? సీఎం రేవంత్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేశారు" అని హరీశ్ ఫైర్ అయ్యారు. 2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, సహాయకులకు రూ. 2,200 వేతనాలు లభించేవని గుర్తుచేసిన ఆయన.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వేతనాలను పెంచామన్నారు.