హైదరాబాద్, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెడుతున్న సీఎం రేవంత్రెడ్డి.. ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62 వేల మంది అంగన్వాడీ సోదరీమణుల కష్టాలు కనిపించడం లేదా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోసను అర్థం చేసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు.
అభయహస్తం మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచుతామన్నారని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. మాయమాటలు చెప్పి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఆ హామీకి అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు ప్రచారం చేసుకుంటం అన్నట్టుగా కాంగ్రెస్ వైఖరి ఉందని తెలిపారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్‌గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
