
- మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తనపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పార్టీ మారుతున్నారని, కేసీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌ను అన్‌ఫాలో చేశారని వచ్చిన కథనాలపై సోమవారం ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఇలాంటి తప్పుడు కథనాలను వెంటనే ఆపేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడంవల్లే ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ తనపై బురదజల్లుతున్నారన్నారు.
వారి అబద్ధాలను ప్రజల్లో ఎండగడతామని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరీశ్‌పై కథనాలను బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండించింది. కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అసలు కేసీఆర్‌కు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదని స్పష్టం చేసింది. దీనిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.