అప్పుడు పొగిడి.. ఇప్పుడు విమర్శలా?

అప్పుడు పొగిడి.. ఇప్పుడు విమర్శలా?
  • అప్పుడు పొగిడి.. ఇప్పుడు విమర్శలా?
  • కాళేశ్వరంపై షెకావత్ మాటలను ఖండిస్తున్నం: మంత్రి హరీశ్
  • గొప్ప ప్రాజెక్టని గతంలో కితాబు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
  • ప్రకృతి వైపరీత్యం, అసాధారణ వరద వల్లే కాళేశ్వరానికి నష్టం
  • పాడైన పంప్ సెప్టెంబర్ నాటికి పునరుద్ధరించి నీటిని ఎత్తిపోస్తం
  • అవినీతి జరిగితే ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు?
  • కంపెనీకి సామర్థ్యం లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ఎందుకిచ్చారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడిన వాళ్లే.. ఇప్పుడు రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బాధ్యతారహితంగా మాట్లాడారని, వాటిని ఖండిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్‌‌‌‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యం, అసాధారణ వరద వల్లే కన్నెపల్లిలో మూడు పంపులు దెబ్బతిన్నాయని, అన్నారం పంప్‌‌‌‌హౌస్, సబ్‌‌‌‌స్టేషన్ నీట మునిగాయని చెప్పారు. సెప్టెంబర్ నెలఖారు నాటికి పునరుద్ధరించి నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు. ఇప్పటికే 31 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రబీకి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చిపోయిన మాటలు

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్లే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కడుతున్నారు. మరి కాళేశ్వరం కట్టిన వాళ్లకు సామర్థ్యం లేకుంటే పోలవరం ప్రాజెక్టును ఎలా ఇచ్చారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తమిళనాడుల్లోనూ ఆ సంస్థనే పని చేస్తున్నది’’ అని హరీశ్ రావు చెప్పారు. ‘ప్రాజెక్టులు పాడు కావాలి, తెలంగాణ బాగు పడొద్దు’ అనేది బీజేపీ దుష్ట బుద్ధి అని ఆరోపించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి.. అప్పులు ఇచ్చింది కేంద్ర సర్కారే. ప్రశ్నించక పోతే సై.. ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ వ్యవహారం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కేసీఆర్ ఎండగడుతుంటే బీజేపీ నేతలకు కడుపు మండుతున్నది. అంతకుముందు మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరానికి కితాబిచ్చిన వాళ్లే ఇప్పుడు ఎదో మతలబు ఉందని వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలి. పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరంపై చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారంటే చట్టసభలు బీజేపీకి ఎంత చులకనగా మారాయో అర్థమవుతున్నది” అని విమర్శించారు.

అవినీతి జరిగితే అనుమతులు ఎట్లిచ్చారు?

అవినీతి జరిగితే అనుమతులు ఎలా ఇచ్చారని కేంద్రాన్ని హరీశ్‌‌రావు ప్రశ్నించారు. నచ్చినప్పుడు నీతి... నచ్చనప్పుడు అవినీతా అని ధ్వజమెత్తారు. ‘‘పీఎం మోడీ గతంలో కేసీఆర్ తీరును మెచ్చుకోలేదా? కాళేశ్వరాన్ని తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్ర జల సంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్.. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమని కీర్తించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులివ్వడాన్ని గట్టిగా సమర్థించారు. సమయానికి ముందే ప్రాజెక్టు పూర్తయిందని కితాబిచ్చారు” అని చెప్పుకొచ్చారు. మోడీ తీరును కేసీఆర్ తప్పుబడుతున్నందుకే కాళేశ్వరంపై బీజేపీ మాట మార్చిందని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని మంత్రి షెకావత్ కూడా పార్లమెంటు వేదికగా చెప్పారన్నారు. 

దెబ్బతిన్నది 3 పంపులే..  పునరుద్ధరణ బాధ్యత ఏజెన్సీదే

‘‘ఇటీవల వచ్చిన వరదల స్థాయి 108 మీటర్లు దాటింది. ఇది ప్రకృతి వైపరీత్యం. అసాధారణ వరద వల్లే పంప్ హౌస్‌‌ రెగ్యులేటర్ గేట్ల రబ్బర్ సీల్స్ ఊడిపోయాయి. ఫోర్ బేలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. అదే సమయంలో అతి భారీ వర్షాలకు పంప్ హౌస్‌‌ 220 కేవీ సబ్ స్టేషన్‌‌కు విద్యుత్ సరఫరా చేసే టవర్లు కూడా కూలిపోయాయి. చందన పూర్ వాగు పొంగి అన్నారం బ్యారేజీ రక్షణ కోసం నిర్మించిన కరకట్టపై నుంచి నీరు పొంగిపొర్లి అన్నారం పంప్ హౌస్‌‌ నీట మునిగింది. అయినా అన్నారం పంప్ హౌస్‌‌ మొత్తం సురక్షితంగా ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్‌‌లో బిగించిన 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. నీట మునిగిన పంపులను పునరుద్ధరించే బాధ్యత పూర్తిగా ఏజెన్సీదే. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదు” అని హరీశ్‌‌రావు వివరించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూత పడాలన్న బీజేపీ ఆశలు ఆడియాశలు కాక తప్పవన్నారు. ప్రాజెక్టు పాడైతే బాగుండని బీజేపీ నేతలు కంటున్న కలలు కల్లలుగా మిగలకతప్పదన్నారు. చవకబారు రాజకీయం చేస్తే పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని అంటున్నారని, దుబ్బాక ఎమ్మెల్యే మార్చి 4న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల కోసం మోటర్లను ఆన్ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.