24 గంటల కరెంట్ లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశ్యం : హరీష్ రావు

24 గంటల కరెంట్ లేకుండా చేయాలన్నదే కాంగ్రెస్  ముఖ్య  ఉద్దేశ్యం :  హరీష్ రావు

హైదరాబాద్, వెలుగు :  ‘‘24 గంటల కరెంట్ వస్తలేదని అంటున్నరు కదా.. లాగ్ బుక్​లు.. ఈ బుక్కులు చూసుడు ఎందుకు.. పోయి వైర్లను ముట్టుకోండి.. తెలుస్తది కరెంట్ వస్తదా లేదా” అని కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలా.. వద్దా.. అనేదానిపై  వచ్చే ఎన్నికల్లో రెఫరెండానికి పోదామా అని సవాల్ విసిరారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘మూడు గంటల కరెంట్ చాలంటున్నరు. మా కాంగ్రెస్ హయాంలో బాగిచ్చినం .. మాదంతా ఏ గ్రేడ్ అన్నరు. ప్రజల వద్దకు రెఫరెండానికి పోదాం. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కరెంట్ ఎట్లుందనే దానిపై రేపు ఎన్నికలకు పోదాం. దమ్ముంటే ఒప్పుకోండి.. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్​ఫార్మర్లు.. కండ్లల్లో వత్తులు వేసుకొని కరెంట్ కోసం ఎదురు చూసిన్రు”అని హరీశ్​ విమర్శించారు. దొంగరాత్రి వచ్చే కరెంట్​తో పాములు, తేళ్లు కుట్టి చచ్చిపోయిన రోజులున్నాయని, కరెంట్ కోసం పొలాల దగ్గర్నే పండుకున్న రోజులను ఒకసారి ప్రజలకు చెప్దామన్నారు. మీటర్లు పెడ్తామని.. మూడు గంటలు, ఎనిమిది గంటలు చాలని అంటున్నరు కదా.. దీనిమీదనే ఎన్నికలకు పోదాం.. సిద్ధమా?” అని మంత్రి హరీశ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంట్ నుంచి..

బషీర్​బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం పెద్ద జోక్ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంట్ నుంచి అని అన్నారు. చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తగ్గించాలని అప్పుడు డిప్యూటీ స్పీకర్​గా ఉన్న కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నదని మొదట స్పందించిందే కేసీఆర్ అని, పదవులను గడ్డిపోచల్లా వదులుకున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. పదవుల కోసం పార్టీలు మారే నేతలు కాంగ్రెసోళ్లని విమర్శించారు. ‘‘మూడు పంటలు కావాలా.. మూడు గంటల కరెంట్ ​కావాలా.. మతం పేరుతో మంటలు కావాలా.. అనేది ప్రజలు, రైతులే ఆలోచించుకోవాలి. సాగుకు మూడు గంటల కరెంట్​చాలని చెప్పి కాంగ్రెస్ నేతలు కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నరు. రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడే అన్నడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బోరు బావులకు మీటర్లు పెడ్తామని ఒకరు.. సోనియా గాంధీ ఫ్రీ కరెంట్​కు వ్యతిరేకమని ఇంకొకరు అంటున్నారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే”అని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగైదు గంటలే కరెంట్ వచ్చేదని, ఏడు గంటలు ఇవ్వలేమని అప్పటి సీఎం స్టేట్​మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు.

2004లో 7 గంటల కరెంట్ ఇవ్వలేమన్నరు

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటే ఇవ్వడం లేదని హరీశ్ విమర్శించారు. 2004లో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేమని అన్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక్కరోజైనా కరెంట్ సమస్య ఉందని ఎవరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చారన్నారు. చంద్రబాబు ఉచిత కరెంట్ వద్దు అంటే ప్రజలు ఇంటికి పంపించారని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కరెంట్​పై మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 

30 లక్షల వ్యవసాయ కనెక్షన్లు

తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ కనెక్షన్​లుంటే.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న దగ్గర డీజిల్ ఇంజిన్లు నడుస్తున్నాయని హరీశ్ ఎద్దేవా చేశారు. రూ.37 వేల కోట్లతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాత్రిపూట నక్సలైట్లు అనుకొని బావుల కాడ రైతులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విధానాలపై తమ పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ మాట్లాడితే బెదిరింపు కాల్స్ ​వస్తున్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేక వార్నింగ్స్ ఇస్తున్నారన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన నియోజవర్గంలో ఉన్న హాస్పిటల్ సమస్యలపైనే తనను కలిశారని, రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు.