నీటి వాటా తేలకుండా బనకచర్ల ఎట్ల కడ్తరు?: హరీశ్‌‌రావు

నీటి వాటా తేలకుండా  బనకచర్ల ఎట్ల కడ్తరు?: హరీశ్‌‌రావు
  • ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు మరో తెలంగాణ ఉద్యమం
  • బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సులో పవర్ ​పాయింట్​ ప్రజెంటేషన్​

నాచారం, వెలుగు:  తెలంగాణ నీటివాటాల లెక్క తేలకుండా బనకచర్ల ఎలా కడ్తారని ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు ప్రశ్నించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్నదని బనకచర్ల కడితే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్‌‌‌‌లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​​ కేటీఆర్‌‌‌‌తోపాటు  హరీశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బనకచర్లపై హరీశ్‌‌  పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. 

గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన లేఖలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  నీటి వాటాల లెక్క తేలకుండా వరద జలాలను ఎలా తీసుకెళ్తారని చంద్రబాబుపై హరీశ్‌‌రావు మండిపడ్డారు. నీళ్లు నిండుగా ఉంటే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించారని నిలదీశారు. 

ఉమ్మడి ఏపీలో కేటాయించిన నీళ్లనే చంద్రబాబు అడ్డుకుంటున్నాడని హరీశ్‌‌రావు మండిపడ్డారు. కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ 2020లోనే నాటి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌కు లేఖ రాశారని, సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 1,950 టీఎంసీలు కేటాయించాలని కోరారని తెలిపారు. హైదరాబాద్ నీటి అవసరాలు, పరిశ్రమల కోసం వాటిని వినియోగించుంటామని లేఖలో పేర్కొన్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు 400 టీఎంసీలు వినియోగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

యూనివర్సిటీల వేదికగా ఉద్యమం

తెలంగాణ నీటివాటా తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు ఎట్లా కడుతావని చంద్రబాబును రేవంత్ రెడ్డి అడగడం లేదని  హరీశ్‌‌రావు మండిపడ్డారు. గోదావరి నీళ్ల లెక్క, వాటా తేలకుండా రాత్రికి రాత్రి ఏపీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఊరుకోబోదని అన్నారు. దీనికి రేవంత్‌‌రెడ్డి అంగీకరించినా తెలంగాణ సమాజం ఒప్పుకోబోదని అన్నారు. నీళ్ల కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందని, మరోసారి వర్సిటీలు ఉద్యమ వేదికలు అవుతాయని హెచ్చరించారు. 

బనకచర్ల ప్రాజెక్టు కోసం రేవంత్ రెడ్డి సంతకాలు పెడితే కేసీఆర్, రైతులు ఊరుకోబోరని అన్నారు. దీనిని అడ్డుకునేందుకు  సుప్రీంకోర్టుకైనా వెళ్తామని, రహదారులను దిగ్బంధిస్తామని చెప్పారు.  ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని, ఈప్రాజెక్టును కట్టి కృష్ణా పరివాహక ప్రాంతానికి నీటిని తీసుకెళ్తామని చెప్పారని తెలిపారు. 1980లో బచావత్ ట్రిబ్యునల్ 80 టీఎంసీలను కృష్ణా నదికి తరలిస్తే, నాగార్జునసాగర్‌‌ మీద ఉన్న 45 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని చెప్పిందని గుర్తుచేశారు. 

ఆ 45 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. 80 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకెళ్తే ప్లోరాట ప్రకారం నీళ్లు కేటాయించాలన్నారు. 157 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తేనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలన్నారు. 

మిత్తీతో బదులిస్తం: కేటీఆర్​

మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమేనని కేటీఆర్​అన్నారు. రేవంత్‌‌ రెడ్డికి పోలీసులు, అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారికి మిత్తీతోసహా బదులిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు ఏకమై తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టై పోలీస్ స్టేషన్‌‌లో ఉంటే ఆయనింటికి పోలీసులు వెళ్లారని కేటీఆర్ తెలిపారు. గెల్లు భార్య ఫోన్ ఇవ్వనని చెప్పినందుకు ఆమెపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘అసలు పోలీసులకు మెదడు ఉందా? చదువుకున్నారా? లేదా?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.