
నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రూపకల్పన చేసిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు.. దేశంలో నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం అని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నీరు అందించేలా తెలంగాణ నడిగడ్డపై ఈ జలాశయ నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు తాగు, సాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీరుతాయని హరీశ్ రావు చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదన్న ఆయన.. వారి కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్ సమీపంలో ఆర్ అండ్ డీ కాలనీ నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు సీఎం కేసీఆర్ది కూడా నిర్వాసిత కుటుంబమేనని, అందుకే భూములు కోల్పోయినవారికి న్యాయప్రకారం దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.